Rohit Sharma: హార్దిక్‌ పాండ్యా అద్భుతం! ఆ తప్పులు పునరావృతం కానివ్వం: రోహిత్‌ శర్మ

8 Jul, 2022 07:40 IST|Sakshi
రోహిత్‌ శర్మ- హార్దిక్‌ పాండ్యా(PC: BCCI)

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్‌లో వైవిధ్యం చూపిస్తూ ఇంగ్లండ్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన విధానాన్ని కొనియాడాడు. భవిష్యత్తులోనూ హార్దిక్‌ ఇలాగే మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా రోహిత్‌ సేన గురువారం బట్లర్‌ బృందంతో మొదటి టీ20 మ్యాచ్‌లో తలపడింది.

సౌతాంప్టన్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీపక్‌ హుడా(33 పరుగులు), సూర్యకుమార్‌ యాదవ్‌(39 పరుగులు)కు తోడు హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకం(51 పరుగులు) రాణించాడు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా ఆరంభం నుంచే అటాకింగ్‌ బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ ఒకటి, అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు, హర్షల్‌ పటేల్‌ ఒకటి, యజువేంద్ర చహల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

దీంతో 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది. వెరసి 50 పరుగుల తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రోహిత్‌ సేన 1-0తో ముందంజలో నిలిచింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ విజయంపై స్పందించిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ‘‘మొదటి బంతి నుంచే గొప్ప ప్రదర్శన కనబరిచాం. బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. నిజానికి పిచ్‌ బాగుంది. మేము మంచి షాట్లు ఆడాము. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ నన్ను కట్టిపడేసింది. అద్భుతంగా రాణించాడు. భవిష్యత్తులో తను మరింతగా రాణించాలి.

బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగాలి. తను బ్యాటింగ్‌ కూడా బాగా చేయగలడు. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని పేర్కొన్నాడు. అయితే, తాము క్యాచ్‌లు వదిలేయడం నిరాశ కలిగించిందని, రానున్న మ్యాచ్‌లలో ఈ తప్పిదం పునరావృతం కాకుండా చూసుకుంటామని రోహిత్‌ తెలిపాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ కూడా బాగా చేస్తామని పేర్కొన్నాడు.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టీ20 మ్యాచ్‌:
టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
ఇండియా స్కోరు: 198/8 (20)
ఇంగ్లండ్‌ స్కోరు: 148 (19.3)
విజేత: ఇండియా(50 పరుగుల తేడాతో విజయం)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హార్దిక్‌ పాండ్యా(51 పరుగులు, 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు)

చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్‌ అయితే ప్రపంచకప్‌ జట్టు నుంచి కోహ్లి అవుట్‌!

మరిన్ని వార్తలు