Ind VS Sa 1st Test: 327 అనేది మరీ చెత్త స్కోరేమీ కాదులే.. మనోళ్లు తక్కువేం కాదు!

28 Dec, 2021 16:56 IST|Sakshi

Ind VS Sa 1st Test: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు లుంగి ఎన్గిడి. వరుసగా వికెట్లు పడగొట్టి కోహ్లి సేనను దెబ్బకొట్టాడు. మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కగిసో రబడ సైతం ఎన్గిడికి తోడు కావడంతో 272 పరుగుల స్కోరు వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత్‌.. కేవలం యాభై పరుగుల వ్యవధిలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. 327 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. ఎన్గిడికి 6, రబడకు 3, జాన్‌సెన్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

దీంతో ప్రొటిస్‌ బౌలర్లను ప్రశింసిస్తూనే.. టీమిండియా బ్యాటింగ్‌ తీరును ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘ఎన్గిడి, రబడ సూపర్‌... టీమిండియా భారీ స్కోరు చేస్తుందనుకుంటే.. కేవలం 36 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, మాజీ ఆటగాడు పార్థివ్‌ పటేల్‌ మాత్రం భారత జట్టుకు అండగా నిలిచాడు. ‘‘సెంచూరియన్‌ టెస్టు... మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిన విధానాన్ని విమర్శించడం తేలికే. కానీ... 327 అనేది మరీ చెత్త స్కోరేమీ కాదు. టాస్‌ గెలిచిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఈ మాత్రం స్కోరు చేయడం మంచి విషయం’’అని ట్వీట్‌ చేశాడు. 

అదే విధంగా... టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ సైతం.. ‘‘50 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు! తమ బౌలింగ్‌ అటాక్‌ ఎలా ఉంటుందో దక్షిణాఫ్రికా బౌలర్లు మరోసారి నిరూపించారు. తమను తక్కువగా అంచనా వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూపించారు. అయితే, భారత బౌలర్లు కూడా ఇలాంటి పిచ్‌పై అద్భుతాలు చేయగలరు’’ అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే భారత పేసర్లు ప్రొటిస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

చదవండి: IPL 2022- Ambati Rayudu : "నాకు ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలి అని ఉంది"

మరిన్ని వార్తలు