India Tour Of South Africa- Rahul Dravid: కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు.. అయితే..

6 Dec, 2021 19:20 IST|Sakshi
PC: BCCI

India Tour Of South Africa Rahul Dravid On Selection Have To Make Tough Decisions: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పూర్తిగా విశ్రాంతినివ్వగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో టెస్టుతో జట్టులోకి వచ్చాడు. మరోవైపు.. అరంగేట్ర హీరో శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టులో తన స్థానాన్ని మరింత బలపరచుకోగా.. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే, నయా వాల్‌ ఛతేశ్వర్‌ పుజారా మాత్రం ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు.

కాన్పూర్‌ టెస్టులో విఫలమైన రహానేను ముంబై టెస్టుకు పక్కనపెట్టగా.. పుజారాకు మరో అవకాశం ఇచ్చినా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరోవైపు.. తొలి టెస్టులో తేలియపోయిన మయాంక్‌ అగర్వాల్‌ రెండో టెస్టులో భారత్‌ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు. ఇక స్వదేశంలో కివీస్‌ను మట్టికరిపించి సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాకు పయనం కానుంది.

ఈ నేపథ్యంలో టెస్టు జట్టు ఎంపికపై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ తలనొప్పి(సెలక్షన్‌)తో బాధపడటం చాలా బాగుంటుంది. యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. పోటీ పెరిగింది. బాగా ఆడాలన్న కసితో ఒకరిని మించి ఒకరు.. పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. కాబట్టి తలనొప్పి ఇంకాస్త పెరుగుతుంది.

కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అలాగే ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా ఆటగాళ్లకు వివరిస్తే పెద్దగా సమస్యలు ఉండవు’’ అని చెప్పుకొచ్చాడు. మరోవైపు కెప్టెన్‌ కోహ్లి రహానేకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టెస్టు జట్టు ఎంపిక ఎలా ఉంటుందోనన్న అంశం మరింత ఉత్కంఠగా మారింది. యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, మహ్మద్‌ సిరాజ్‌ కచ్చితంగా జట్టులో చోటు దక్కించుకుంటారని అభిమానులు అంటున్నారు.

చదవండి: ICC Test Rankings- India No.1: కివీస్‌పై ప్రతీకారం.. అదరగొట్టిన కోహ్లి సేన..నెంబర్‌ 1!
Ind Vs Nz 2nd Test- Virat Kohli: రీసౌండ్‌.. దద్దరిల్లిపోలా! టీమిండియా అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌ అతడే!

మరిన్ని వార్తలు