LLC 2023: క్రిస్‌ గేల్‌ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్‌ బాస్‌

16 Mar, 2023 10:24 IST|Sakshi

విండీస్‌ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. బాస్‌.. గతంలో బంతిని ఎలా చెడుగుడు ఆడేవాడో ఇప్పుడు అదే రీతిలో చెలరేగుతున్నాడు. గేల్‌ 43 ఏళ్ల వయసులోనూ యువకుల తరహాలో భారీ షాట్లు ఆడి ఔరా అనిపిస్తున్నాడు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2023 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 15) ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి పాత రోజులు గుర్తు చేశాడు. అంతేకాక అతని జట్టు వరల్డ్‌ జెయింట్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

వివరాల్లోకి వెళితే.. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన వరల్డ్‌ జెయింట్స్‌.. బ్రెట్‌ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్‌ (4-0-27-2) చెలరేగడడంతో ప్రత్యర్ధిని 136 పరుగులకే కట్టడి చేసింది. మహారాజాస్‌ టీమ్‌లో సురేశ్‌ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగు తేడాతో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకోగా.. బిస్లా (36), ఇర్ఫాన్‌ పఠాన్‌ (25) ఓ మోస్తరుగా రాణించారు.

అనంతరం బరిలోకి దిగిన వరల్డ్‌ జెయింట్స్‌.. క్రిస్‌ గేల్‌ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్‌) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్‌కు షేన్‌ వాట్సన్‌ (26), సమిత్‌ పటేల్‌ (12) సహకరించారు. మహారాజాస్‌ బౌలర్లలో యుసఫ్‌ పఠాన్‌ (4-0-14-2), ప్రవీణ్‌ తాంబే (4-0-22-1), హర్భజన్‌ సింగ్‌ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేం‍దుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్‌ జట్టుకు హర్భజన్‌ సింగ్‌ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు.

లీగ్‌లో మహారాజాస్‌ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్‌లో గెలవగా.. వరల్డ్‌ జెయింట్స్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 16) వరల్డ్‌ జెయింట్స్‌, ఆసియా లయన్స్‌ తలపడనున్నాయి.    

మరిన్ని వార్తలు