Babar Azam: లంక ప్రీమియర్‌ లీగ్‌లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌

7 Aug, 2023 19:13 IST|Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 7) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (59 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) పొట్టి క్రికెట్‌లో (అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లు) అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో 10 శతకాలు బాదిన రెండో బ్యాటర్‌ రికార్డుల్లోకెక్కాడు.

బాబర్‌కు ముందు విధ్వంకర వీరుడు, విండీస్‌ యోధుడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. గేల్‌ తన 463 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో ఏకంగా 22 శతకాలు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 2005 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ​్‌ల్లో పాల్గొన్న గేల్‌ 22 సెంచరీలతో పాటు 88 హాఫ్‌సెంచరీలు బాది 14562 పరుగులు చేశాడు.

ఇందులో గేల్‌ 2013 ఐపీఎల్‌లో పూణే వారియర్స్‌పై చేసిన 175 నాటౌట్‌ (66 బంతుల్లో) అత్యధికంగా ఉంది. గేల్‌ తర్వాతి స్థానంలో ఉన్న బాబర్‌ 2012 నుంచి నేటి వరకు 264 టీ20లు ఆడి 10 సెంచరీలు 77 హాఫ్‌ సెంచరీల సాయంతో 9412 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక​ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, బాబర్‌ల తర్వాత క్లింగర్‌ (206 మ్యాచ్‌ల్లో 5960 పరుగులు, 8 సెంచరీలు), డేవిడ్‌ వార్నర్‌ (11695 పరుగులు, 8 సెంచరీలు), విరాట్‌ కోహ్లి (11965, 8), ఆరోన్‌ ఫించ్‌ (11392, 8) తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 7) జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్టయికర్స్‌ ఆటగాడు విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్‌ కెప్టెన్‌.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు