మనీషా కిక్‌ కొడితే...

20 Aug, 2022 06:15 IST|Sakshi

అరుదైన ఘనత సాధించిన ఫుట్‌బాలర్‌

మహిళల చాంపియన్స్‌ లీగ్‌లో ఆడిన 

తొలి భారతీయురాలిగా గుర్తింపు  

పంజాబ్‌ రాష్ట్రం హొషియార్‌పూర్‌ జిల్లాలోని ముగొవాల్‌ గ్రామం...ఆ ఊర్లో ఒక రోజు ఒక టీనేజ్‌ అమ్మాయి ఫుట్‌బాల్‌తో డ్రిబ్లింగ్‌ చేస్తూ మైదానంలో కనిపించింది. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఆ గ్రామానికి ఇది కూడా ఒక వార్తగా మారింది! అమ్మాయిలు ఆటలు ఆడటమే ఎక్కువ అనుకుంటే అందులోనూ ఫుట్‌బాల్‌ ఆడటం వారిని సహజంగానే ఆశ్చర్యానికి గురి చేసింది. ఊహించినట్లుగానే అందరినుంచీ విమర్శలూ వచ్చాయి. అయితే ఆ అమ్మాయి ఎవ్వరీ మాటా వినలేదు, తన ఆటనూ మార్చుకోలేదు. ఆ తర్వాత మైదానంలోనే సత్తా చాటి అనూహ్య వేగంతో దూసుకుపోయింది. ఇప్పుడు భారత్‌ తరఫున చాంపియన్స్‌ లీగ్‌ బరిలోకి దిగిన  తొలి మహిళగా ఘనతకెక్కింది. 21 ఏళ్ల ఆ ప్లేయర్‌ పేరే మనీషా కల్యాణ్‌.                  

పాఠశాలలో ఉన్నప్పుడు చాలా మందిలాగే మనీషా రన్నింగ్‌ రేస్‌లలో పాల్గొంది. స్కూల్‌లోనే కాబట్టి ఆ విషయంలో ఎప్పుడూ పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ ఒక రోజు మనీషాలోని వేగాన్ని, ఆమె కాళ్ల కదలికలను గుర్తించిన కోచ్‌ ఆమె ఫుట్‌బాల్‌కైతే సరిగ్గా సరిపోతుందని భావించాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. మనీషాకు కూడా వ్యక్తిగత క్రీడలకంటే టీమ్‌ గేమ్‌లంటే  ఎక్కువ ఇష్టం ఉండటంతో వెంటనే ఓకే అనేసింది.

అయితే వీరిద్దరు కూడా ఊర్లో వచ్చే అభ్యంతరాల గురించి అసలు ఆలోచించలేకపోయారు. చిన్నపాటి దుకాణం నడుపుకునే తండ్రికి ఆటలపై ఎలాంటి అవగాహన లేకపోగా, అసలు మనకెందుకీ తంటా అన్నట్లుగా పెద్దగా ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే కోచ్‌ అన్ని విషయాల్లో సరైన మార్గదర్శిగా నిలవడం మనీషాను ముందుకు వెళ్లేలా చేయగలిగింది. అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌ / ఫార్వర్డ్‌గా మైదానంలో మనీషా తన ముద్ర చూపించగలిగింది. 2021–22లో భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎమర్జింగ్‌ ఫుట్‌బాలర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు కూడా ఆమెకే
దక్కింది.  

వేగంగా దూసుకెళ్లి...
13 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్‌ వైపు మళ్లిన ఈ అమ్మాయి నాలుగేళ్లు తిరిగే సరికే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. వేర్వేరు వయో విభాగాల సెలక్షన్స్‌లో రాణించడంతో మనీషాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన ‘బ్రిక్స్‌’ దేశాల అండర్‌–17 ఫుట్‌బాల్‌ కప్‌తో తొలిసారి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే మనీషా కల నెరవేరింది. ఆ తర్వాత 2019 ఏఎఫ్‌సీ అండర్‌–19 చాంపియన్‌షిప్‌ ఆమె కెరీర్‌లో మరో మలుపు.

భారత జట్టు పాకిస్తాన్‌ను 18–0తో చిత్తు చేసిన మ్యాచ్‌లో ‘హ్యాట్రిక్‌’తో చెలరేగిన మనీషా థాయిలాండ్‌పై భారత్‌ విజయం సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే సీనియర్‌ టీమ్‌కు కూడా ఎంపికై మనీషా సంచలనం సృష్టించింది. 2019 ‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీషా అరంగేట్రం చేసింది. గత ఏడాది ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో బ్రెజిల్‌పై సాధించిన గోల్‌ ఆమెను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది.  

క్లబ్‌ తరఫున ఆడుతూ...
ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు లీగ్‌లలో క్లబ్‌లకు ఆడే అవకాశం రావడం కూడా ఆటగాళ్లకు వరంలాంటిదే. మనీషా ప్రతిభను గుర్తించిన ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌ క్లబ్‌ ‘గోకులమ్‌ కేరళ’ ఆమెను జట్టులోకి తీసుకుంది. ఆ జట్టు వరుస విజయాలతో టైటిల్‌ గెలవడంలో భాగం కావడంతో పాటు ప్రతిష్టాత్మక ఏఎఫ్‌సీ ఉమెన్స్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్‌లో గోకులమ్‌ టీమ్‌ తరఫున ఆడుతూ ఉజ్బెకిస్తాన్‌ క్లబ్‌ బున్యోడ్కర్‌ ఎఫ్‌సీపై చేసిన గోల్‌తో మనీషా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ టోర్నీలో ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌’ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడే అదే ఆమెకు యూఈఎఫ్‌ఏ మహిళల చాంపియన్స్‌ లీగ్‌లో ఆడే అవకాశం కల్పించింది. భారత మహిళల ఫుట్‌బాల్‌లో దిగ్గజంలాంటి బాలాదేవిని అభిమానించే మనీషా ఆమె తరహాలో మరింత పైకి ఎదగాలని పట్టుదలగా ఉంది.  

యూఈఎఫ్‌ఏ మహిళల చాంపియన్స్‌ లీగ్‌లో ఆడిన తొలి భారత మహిళగా మనీషా నిలిచింది. ‘అపోలాన్‌ లేడీస్‌ ఎఫ్‌సీ’ టీమ్‌ తరఫున గురువారం ఆమె అరంగేట్రం చేసింది. ఎస్‌ఎఫ్‌కే రిగాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 60వ నిమిషంలో మరిలెనా జార్జియాకు సబ్‌స్టిట్యూట్‌గా మనీషా మైదానంలోకి దిగింది. అపోలాన్‌ టీమ్‌తో ఆమె రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.  

–సాక్షి క్రీడా విభాగం

మరిన్ని వార్తలు