పాపం రాబిన్సన్‌.. క్షమించమని కోరినా కనికరించలేదు

7 Jun, 2021 18:17 IST|Sakshi

లండన్: ఎనిమిదేళ్ల క్రితం మిడిమిడి జ్ఞానంతో చేసిన తప్పిదానికి ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్సన్‌ ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడని టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ విచారం వ్యక్తం చేశాడు. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల రాబిన్సన్.. 2013లో సోషల్ మీడియా వేదికగా స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలతో పాటు జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిపై విచారణ చేపట్టి, అతన్ని తక్షణమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే, ఈ వ్యవహారంపై టీమిండియా స్టార్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా ఓలీ రాబిన్సన్‌కు మద్దతు తెలుపుతూనే.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోని ప్రవర్తించాలని ఈ తరం ఆటగాళ్లను హెచ్చరించాడు. ఈ సందర్భంగా ఆయన ఈసీబీ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రాబిన్సన్‌ అప్పుడెప్పుడో చేసిన తప్పుకు క్షమించమని కోరినా ఈసీబీ ఇంత కఠినంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. టెస్ట్ కెరీర్‌లో అద్భుతమైన ఆరంభం లభించిన ఆటగాడిని ఈ రకంగా శిక్షించడం బాధగా ఉందని వాపోయాడు. ఏదిఏమైనప్పటికీ.. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఇదో హెచ్చరిక లాంటిదని ట్వీట్ చేశాడు. కాగా, ఓలీ రాబిన్సన్‌ తన తొలి టెస్ట్‌లో 7 వికెట్లతో పాటు 42 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ డ్రాతో గట్టెక్కింది. కివీస్‌ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ డామినిక్‌ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్‌ జో రూట్‌ (40) పర్వాలేదనిపించాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో అదరగొట్టిన కివీస్‌ ఆటగాడు డెవాన్‌ కాన్వేను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది.
చదవండి: నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్‌బుక్‌ అప్‌డేట్‌ చూసి షాక్‌ తిన్న అభిమానులు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు