గంగూలీ, షా లకు ‘జై’

15 Sep, 2022 04:04 IST|Sakshi

బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులకు సుప్రీం కోర్టులో ఊరట

మరో మూడేళ్లు పదవిలో కొనసాగేందుకు అవకాశం

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక పరిణామం. నియమావళిలో మార్పులకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించిన బోర్డుకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఇకపై బీసీసీఐతో పాటు రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో కలిపి వరుసగా 12 ఏళ్లు పదవిలో ఉండే అవకాశంతో పాటు ఆ తర్వాతే మూడేళ్లు విరామం (కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌) ఇచ్చే విధంగా నిబంధనను మార్చుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడా బెంచ్‌ బుధవారం దీనిపై స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా రాష్ట్ర క్రికెట్‌ సంఘంలో లేదా బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేళ్లు పదవీకాలం ముగిసిన తర్వాత కనీసం మూడేళ్లు విరామం ఇచ్చిన తర్వాతే మళ్లీ ఏదైనా పదవి కోసం పోటీ పడవచ్చు. అయితే ఇప్పుడు సుప్రీం అనుమతించిన దాని ప్రకారం బీసీసీఐలో ఆరేళ్లు, రాష్ట్ర క్రికెట్‌ సంఘంలో ఆరేళ్ల పదవిని వేర్వేరుగా చూడనున్నారు.

అంటే రాష్ట్ర సంఘంలో పని చేసిన తర్వాత కూడా బీసీసీఐలో వరుసగా మూడేళ్ల చొప్పున వరుసగా రెండు పర్యాయాలు (మొత్తం ఆరేళ్లు) పదవి చేపట్టే అవకాశం ఉంది. తాజా ఉత్తర్వుల ప్రకారం అందరికంటే ఎక్కువ ప్రయోజనం బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షాలకు లభించనుంది. వీరిద్దరు 2019లో పదవిలోకి వచ్చారు. గత నిబంధనల ప్రకారం వారిద్దరి పదవీ కాలం ఇటీవలే ముగిసింది.

అయితే పదే పదే వ్యక్తులు మారకుండా అనుభవజ్ఞులు ఎక్కువ కాలం బోర్డులో ఉంటే ఆటకు మేలు జరుగుతుందనే వాదనతో సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. ఈ వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో గంగూలీ, జై షా మరోసారి ఎన్నికై 2025 వరకు తమ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. సుప్రీం ఉత్తర్వుల కోసం వేచి చూస్తూ ఈ నెల చివర్లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసిన బీసీసీఐ త్వరలోనే ఎన్నికలు జరిపేందుకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు