సబలెంకాకు షాక్‌

4 Oct, 2020 03:03 IST|Sakshi

మూడో రౌండ్‌లోనే ఓడిన ఎనిమిదో సీడ్‌

ప్రిక్వార్టర్స్‌లో క్విటోవా, సోఫియా

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ

పారిస్‌: టెన్నిస్‌ సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీగా జరుగుతోన్న ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎనిమిదో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), 13వ సీడ్‌ పెట్రా మార్టిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)... పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ), పదో సీడ్‌ రొబెర్టో బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌) మూడో రౌండ్‌లో ఇంటిముఖం పట్టారు. ట్యూనిషియా క్రీడాకారిణి, ప్రపంచ 35వ ర్యాంకర్‌ ఆన్స్‌ జెబర్‌ 7–6 (9/7), 2–6, 6–3తో సబలెంకాను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేసింది. సబలెంకా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌–10లో ఐదుగురు మాత్రమే మిగిలారు. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6–2, 6–0తో ఇరీనా బారా (రొమేనియా)పై, ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7–5, 6–3తో లెలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై నెగ్గగా... 13వ సీడ్‌ పెట్రా మార్టిక్‌ 7–6 (7/5), 3–6, 0–6తో లౌరా సిగెముండ్‌ (జర్మనీ) చేతిలో, 2017 చాంపియన్‌ ఒస్టాపెంకో (లాత్వియా) 4–6, 3–6తో పౌలా బడోసా (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయారు. 

క్వాలిఫయర్‌ ఆల్ట్‌మైర్‌ సంచలనం
పురుషుల సింగిల్స్‌లో క్వాలిఫయర్, 186వ ర్యాంకర్‌ డానియల్‌ ఆల్ట్‌మైర్‌ సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో రౌండ్‌లో ఆల్ట్‌మైర్‌ 6–2, 7–6 (7/5), 6–4తో ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ)పై నెగ్గాడు. తద్వారా 2000 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన ఐదో క్వాలిఫయర్‌గా గుర్తింపు పొందాడు. పదో సీడ్‌ అగుట్‌ 4–6, 3–6, 7–5, 4–6తో కరెనో బుస్టా (స్పెయిన్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–0, 6–3, 6–2తో డానియల్‌ గలాన్‌ (కొలంబియా)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా