ఐదేళ్ల తర్వాత క్రికెటర్ రీఎంట్రీ‌‌

13 Mar, 2021 08:12 IST|Sakshi

కరాచీ: వివాదాస్పద క్రికెటర్‌ షార్జీల్‌ ఖాన్‌ ఐదేళ్ల తర్వాత పాకిస్తాన్‌ టి20 జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యాడు. 2017లో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సందర్భంగా షార్జీల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై ఐదేళ్ల నిషేధం విధించారు. 2019లో షార్జీల్‌ భేషరతు క్షమాపణలు చెప్పడంతో పాక్‌ బోర్డు నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం తొలిగాక షార్జీల్‌ జాతీయ టి20 కప్‌లో, పాక్‌ సూపర్‌ లీగ్‌లో నిలకడగా రాణించి జట్టులోకి వచ్చాడు.  

ఫాలోఆన్‌లో జింబాబ్వే
అబుదాబి: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే క్రికెట్‌ జట్టు ఎదురీదుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 50/0తో ఆట మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే 287 పరుగులవద్ద ఆలౌటైంది. సికిందర్‌ రజా (85; 7 ఫోర్లు, సిక్స్‌), ప్రిన్స్‌ మాస్వెర్‌ (65; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ నాలుగు, అమీర్‌ హంజా మూడు వికెట్లు తీశారు. 258 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన అఫ్గానిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించకుండా జింబాబ్వేకు ఫాలోఆన్‌ ఇచ్చింది. ఆట ముగిసే సమయానికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే జింబాబ్వే మరో 234 పరుగులు చేయాలి.

మరిన్ని వార్తలు