T20 World Cup 2022: ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ సహా ఆ మ్యాచ్‌లన్నీ వర్షార్పణం

19 Oct, 2022 15:15 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఇవాళ (అక్టోబర్‌ 19) జరగాల్సిన ఆఖరి వార్మప్‌ మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా రద్దయ్యాయి. వీటిలో భారత్‌-న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌లు కనీసం టాస్‌ కూడా పడకుండానే రద్దవగా.. ఆఫ్ఘనిస్తాన్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ మాత్రం మధ్యలో ఆగిపోయింది. ఒక ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక, రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభంలో వర్షం మొదలు కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్‌ మహ్మద్‌ నబీ (37 బంతుల్లో 51 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (35), ఉస్మాన్‌ ఘనీ (32 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది, హరీస్‌ రౌఫ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. 2.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మహ్మద్‌ రిజ్వాన్‌ 0 పరుగులు, కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

వార్మప్‌ మ్యాచ్‌లు రద్దు కావడంతో ఆయా జట్లు నిరాశకు లోనయ్యాయి. సూపర్‌-12 మ్యాచ్‌లను ముందు ఆడే వార్మప్‌ మ్యాచ్‌ల వల్ల పిచ్‌, వాతావరణం తదితర అంశాలపై అవగాహన వస్తుందని ఆయా జట్లు భావించాయి. అయితే ఈ మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులూ నిరాశ చెందారు. 

మరోవైపు ఇవాళ క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సూపర్‌ 12 ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌.. డూ ఆర్‌ డై సమరంలో జింబాబ్వేను ఢీకొడుతుంది. ఇదిలా ఉంటే, సూపర్‌-12 దశ మ్యాచ్‌లు అక్టోబర్‌ 22 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. 23న టీమిండియా.. దాయాది పాక్‌ను ఢీకొట్టనుంది.  

>
Poll
Loading...
మరిన్ని వార్తలు