Tokyo Olympics: హృదయం ముక్కలైంది.. అయినా..

3 Aug, 2021 09:17 IST|Sakshi

గెలుపోటములు సహజం: ప్రధాని నరేంద్ర మోదీ

బాధ పడకండి బాయ్స్‌: కిరణ్‌ రిజిజు

టోక్యో: 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరిన భారత పురుషుల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. వరల్డ్‌, యూరోపియన్‌ చాంపియన్‌ బెల్జియం చేతిలో ఓడిపోయింది. మొదట్లో బాగానే ఆడినా, బెల్జియం డిఫెన్స్‌ ముందు తలవంచకతప్పలేదు. ఫలితంగా 5-2 తేడాతో పరాజయం పాలుకావడంతో ఫైనల్‌ చేరే అవకాశం చేజారింది. అయితే, కాంస్యం కోసం జరిగే మరో మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం పతకంతో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. 

కాగా ఈ మ్యాచ్‌ ఫలితం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మ్యాచ్‌ను వీక్షిస్తున్నానంటూ.. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, గెలిచినపుడు మాత్రమే కాదు, ఓటమిలోనూ మీ వెన్నంటే ఉంటామంటూ భారతీయులు పురుషుల హాకీ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. తదుపరి మ్యాచ్‌ కోసం సోషల్‌ మీడియా వేదికగా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. ‘‘41 ఏళ్ల తర్వాత సెమీస్‌ వరకు వెళ్లారు. ప్రత్యర్థి జట్టు కూడా తక్కువదేమీ కాదు కదా. పర్లేదు. మీరు కాంస్యంతో తిరిగి వస్తారనే నమ్మకం ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మిమ్మల్ని చూసి గర్విస్తూనే ఉంటాం: ప్రధాని మోదీ
‘‘మన పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలిపింక్స్‌లో వారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, జీవితంలో గెలుపోటములు సహజం. తదుపరి ఆడనున్న మ్యాచ్‌, భవిష్యత్‌ విజయాల కోసం ఆల్‌ ది బెస్ట్‌. తమ ఆటగాళ్లను చూసి భారత్‌ ఎల్లప్పుడూ గర్విస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

బాధ పడకండి బాయ్స్‌: కిరణ్‌ రిజిజు
ఇక కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు.. ‘‘బాధ పడకండి బాయ్స్‌, మీరు ఇప్పటికే భారత్‌ను ఎంతో గర్వపడేలా చేశారు. ఇప్పటికీ ఒలింపిక్‌ మెడల్‌తో తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాంస్యం కోసం జరిగే పోరులో మీ అత్యుత్తమ ప్రదర్శన కనబరచండి’’ అని ట్విటర్‌ వేదిగకా తన స్పందన తెలియజేశారు. 

హృదయం ముక్కలైంది
హాకీ ఇండియా సైతం.. ‘‘మనసు పెట్టి ఆడాం. కానీ ఇది మన రోజు కాదు’’ అంటూ బ్రేకింగ్‌ హార్ట్‌ ఎమోజీని జతచేసింది. అదే విధంగా.. ‘‘కొన్నింటిలో గెలుస్తారు. మరికొన్నింటిలో ఓడతారు. అయినా మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు’’ అని మద్దతుగా నిలబడింది,

మరిన్ని వార్తలు