Tokyo Paralympics: పారాలింపిక్స్‌ ముగింపు బంగారం

6 Sep, 2021 05:21 IST|Sakshi
విజయానంతరం కోచ్‌తో కృష్ణ నాగర్‌ సంబరం, ఐఏఎస్‌ అధికారి సుహాస్‌ యతిరాజ్‌

పారాలింపిక్స్‌ చివరి రోజు భారత్‌ ఖాతాలో స్వర్ణం

మెరిసిన టీమిండియా షట్లర్లు 

కృష్ణ నాగర్‌కు పసిడి పతకం 

ఐఏఎస్‌ అధికారి సుహాస్‌ యతిరాజ్‌కు రజతం

19 పతకాలతో 24వ స్థానంలో భారత్‌

పారాలింపిక్స్‌లో రజతంతో మొదలైన తమ పతకాల వేటను భారత క్రీడాకారులు స్వర్ణంతో దిగి్వజయంగా ముగించారు. ఈ క్రీడల ఆఖరి రోజు ఆదివారం భారత్‌ రెండు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో çకృష్ణ నాగర్‌ బంగారు పతకం... ఐఏఎస్‌ అధికారి, నోయిడా జిల్లా కలెక్టర్‌ సుహాస్‌ యతిరాజ్‌ రజత పతకం నెగ్గారు. ఓవరాల్‌గా భారత్‌ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి 24వ స్థానంలో నిలిచింది.

టోక్యో: ఆత్మవిశ్వాసమే ఆస్తిగా.... పట్టుదలే పెట్టుబడిగా... అనుక్షణం తమ పోరాట పటిమితో ఆకట్టుకున్న భారత పారాలింపియన్లు టోక్యో విశ్వ క్రీడలకు చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. చివరి రోజు ఒక స్వర్ణం, ఒక రజతం సాధించి యావత్‌ దేశం గర్వపడేలా చేశారు. తొలుత బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–4 విభాగం ఫైనల్లో సుహాస్‌ యతిరాజ్‌ 21–15, 17–21, 15–21తో రెండుసార్లు ప్రపంచ పారా చాంపియన్‌ లుకాస్‌ మజూర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడిపోయి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

తొలిసారి పారాలిం పిక్స్‌లో ఆడుతున్న 38 ఏళ్ల సుహాస్‌ తొలి గేమ్‌ను గెల్చుకున్నా ఆ తర్వాత అదే జోరును కనబర్చలేకపోయాడు. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌–6 కేటగిరీ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన కృష్ణ నాగర్‌ 21–17, 16–21, 21–17తో చు మన్‌ కాయ్‌ (హాంకాంగ్‌)పై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు. సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–4 విభాగం కాంస్య పతక పోరులో భారత ప్లేయర్‌ తరుణ్‌ ధిల్లాన్‌ 17–21, 11–21తో ఫ్రెడీ సెతియవాన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌–3/ఎస్‌ఎల్‌–5 కాంస్య పతక పోరులో ప్రమోద్‌ భగత్‌–పలక్‌ కోహ్లి (భారత్‌) ద్వయం 21–23, 19–21తో దైసుకె ఫుజిహారా–అకీకో సుగినో (జపాన్‌) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. షూటింగ్‌ మిక్స్‌డ్‌ 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌–1 విభాగంలో బరిలోకి దిగిన భారత షూటర్లు సిద్ధార్థ బాబు, దీపక్, అవనీ లేఖరా క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయారు. క్వాలిఫయింగ్‌లో సిద్ధార్థ బాబు 617.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... 612 పాయింట్లు స్కోరు చేసి అవని 28వ స్థానంలో... 602.2 పాయింట్లు సాధించి దీపక్‌ 46వ స్థానంలో నిలిచారు. టాప్‌–8లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది.
 

దటీజ్‌ కృష్ణ...
రెండేళ్లపుడే కృష్ణ నాగర్‌ వయసుకు తగ్గట్టుగా పెరగడని నిర్ధారించారు. కానీ అతనే ఇప్పుడు బంగారం గెలిచేంతగా ఎదిగిపోయాడు. జైపూర్‌ (రాజస్తాన్‌)కు చెందిన కృష్ణది ఎదగలేని వైకల్యం. కానీ దేన్నయినా సాధించే అతని పట్టుదల ముందు మరుగుజ్జుతనమే మరుగున పడింది. పొట్టొడే గట్టోడని టోక్యో పారాలింపిక్స్‌ స్వర్ణంతో నిరూపించాడు. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ పొట్టివాడే. కానీ పతకాలు కొల్లగొట్టేవాడు కూడా! తనకిష్టమైన బ్యాడ్మింటన్‌లో చాంపియన్‌. 14 ఏళ్ల వయసులో షటిల్‌ వైపు దృష్టి మరల్చిన ఈ పొట్టి కృష్ణుడు 2016 నుంచి గట్టి మేలే తలపెట్టాడు.

ప్రొఫెషనల్‌ పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా సత్తా చాటుకోవడం మొదలుపెట్టాడు. 4 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న కృష్ణ నిలకడైన విజయాలతో ఎస్‌హెచ్‌–6 పురుషుల సింగిల్స్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకర్‌గా ఎదిగాడు. 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌íÙప్‌లో సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో రజతం సాధించాడు. గతేడాది బ్రెజిల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా (రజతం)  నిలిచాడు. అదే ఏడాది పెరూలో జరిగిన ఈవెంట్‌లో సింగిల్స్, డబుల్స్‌లో విజేతగా నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు. పోటీల బరిలో అతని ఆత్మవిశ్వాసమే అతన్ని అందనంత ఎత్తులో నిలబెడుతోంది.

ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకానికి ఉండే ప్రత్యేకతే వేరు. ప్రతిష్టాత్మక ఈ విశ్వక్రీడల్లో ఏకంగా బంగారమే సాధిస్తే ఆ ఆనందం మాటలకందదు. మేం బ్యాడ్మింటన్‌లో ఐదారు పతకాలు సాధిస్తామనే ధీమాతో వచ్చాం. చివరకు నాలుగింటితో తృప్తిపడ్డాం. అనుకున్న దానికి ఒకట్రెండు తగ్గినా మా ప్రదర్శన ఎంతో మెరుగైందన్న వాస్తవాన్ని అంగీకరించాలి. ఈ పతకాన్ని కరోనా వారియర్స్‌కు అంకితం ఇస్తున్నాను.      –కృష్ణ నాగర్‌

 

మరిన్ని వార్తలు