-

చెన్నై టెస్ట్‌లో అరుదైన ఘటన

5 Feb, 2021 17:06 IST|Sakshi

సాక్షి, చెన్నై: భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి సారిగా ఇద్దరు స్వదేశీ అంపైర్లు ఫీల్డ్‌ అంపైర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో చివరి సారిగా ఇద్దరు భారత అంపైర్లు బరిలో నిలిచారు. ఆ మ్యాచ్‌లో ఎల్‌.నరసింహన్‌, వీకే రామస్వామిలు ఫీల్డ్‌ అంపైర్లుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇద్దరు భారత అంపైర్లు నితిన్‌ మీనన్‌, అనిల్‌ చౌదరీలు అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌కు కొద్ది రోజుల ముందే నితిన్‌ మీనన్‌, అనిల్‌ చౌదరీతో పాటు వీరేందర్‌ శర్మ అనే అంపైర్‌ను ఐసీసీ నియమించింది. తొలి టెస్టులో అనిల్‌, నితిన్‌ బరిలో నిలువగా రెండో టెస్టులో నితిన్‌కు తోడుగా వీరేందర్‌ ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. కరోనా ప్ర‌యాణ అంక్షల కారణంగా వ‌రల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌సిప్‌కు స్థానిక అంపైర్ల‌నే నియ‌మించుకోవాలని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ అంపైర్ల ప్యానల్‌లో సభ్యులైన ఈ ముగ్గురు భారత అంపైర్లకు ఈ అరుదైన అవకాశం దక్కింది. 

మరోవైపు సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు భారతకు చెందిన వ్యక్తే రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌లకు టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ మ్యాచ్‌ రిఫరీగా విధులు నిర్వహించనున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్‌ జో రూట్‌ అద్భుత శతకం(128 నాటౌట్‌) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్‌ సిబ్లీ(87),వన్‌డౌన్‌ ఆటగాడు డేనియల్‌ లారెన్స్‌ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్‌ లభించింది. 

మరిన్ని వార్తలు