కోవిడ్‌పై వార్‌.. అపార్ట్‌మెంట్ల కేర్‌ 

19 May, 2021 05:05 IST|Sakshi

కరోనా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్న అసోసియేషన్లు 

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్‌ వంటి పెద్ద నగరాల్లోని అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు తమ నివాసితులకు అండగా నిలుస్తున్నాయి. కరోనా బారినపడిన వారికి అవసరమైన ఆహారం, మందులు వంటివాటితోపాటు ఆస్పత్రులతో ఒప్పందాలు, వ్యాక్సినేషన్‌ వంటివీ చేపడుతున్నాయి. కొన్నిచోట్ల మరో అడుగు ముందుకేసి.. మినీ కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్‌ కొరత, వైద్య సేవలకు ఇబ్బందులతోపాటు స్వల్ప లక్షణాలు ఉండి వైద్యుల సూచనలు తీసుకునేవారు, అసలు లక్షణాలే లేనివారు ఎక్కువగా ఉండటంతో ఈ తరహా మినీ కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ప్రయోజనకరంగా నిలుస్తున్నాయి. 

కామన్‌ ఏరియాల్లో ఏర్పాటు చేస్తూ.. 
కమ్యూనిటీలు, కాంప్లెక్స్‌ల నిర్వహణ కమిటీలు, అసోసియేషన్లు.. వాటి ఆవరణలోని క్లబ్‌ హౌస్‌లు, బాంకెట్‌ హాళ్లు, ఇతర కామన్‌ ఏరియాల్లో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిరంతరం అందుబాటులో ఉండేలా డాక్టర్, నర్స్, డయాగ్నస్టిక్‌ కిట్స్, అంబులెన్స్, ఐసొలేషన్‌ బెడ్స్, ఆక్సిజన్‌.. తదితరాలను సమకూర్చుకుంటున్నారు. వీటి నిర్వహణ కోసం స్థానిక ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ‘‘మా ఫ్లాట్స్‌ నివాసితుల కోసం ఆస్పత్రులతో మాట్లాడి వ్యాక్సినేషన్‌ చేయిస్తున్నాం. 10 ఐసొలేషన్‌ బెడ్స్, ఆక్సిజన్‌ సిలిండర్లు, నర్సులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’.. అని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఫార్చ్యూన్‌ టవర్స్‌ నిర్వాహక కమిటీ సభ్యురాలు రాజేశ్వరి తెలిపారు.
 
వైద్య రంగంలోని సంస్థలతో.. 
ఆస్పత్రుల వెలుపల కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేసేందుకు వైద్య రంగంలో ఉన్న మేక్‌షిఫ్ట్, పోర్టియా వంటి సంస్థల సేవలను వినియోగించుకుంటున్నారు. కొన్ని వారాలుగా తమకు గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ల నుంచి ఎంక్వైరీలు వెల్లువెత్తుతున్నాయని పోర్టియా హెల్త్‌కేర్‌ ప్రతినిధి మీనా గణేశ్‌ తెలిపారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. 

ముందు జాగ్రత్తగా.. 
మా కమ్యూనిటీలో 2016 అపార్ట్‌మెంట్లున్నాయి. వాటిలో 7 వేల మంది ఉంటారు. వీరిలో కోవిడ్‌ సోకినవారు పడుతున్న ఇబ్బందులను గమనించాం. ఆస్పత్రులకు వెళ్తున్న వారికి వెంటనే ఆక్సిజన్‌ బెడ్స్‌ దొరకడం లేదు. ఇలాంటి సమయంలో సాయంగా ఉండేలా.. మా కమ్యూనిటీ ఆవరణలో కోవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. 4 బెడ్స్‌. 2 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్, 2 ఆక్సిజన్‌ సిలిండర్స్, బీపీ, టెంపరేచర్‌ పరికరాలు కొన్నాం. పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకున్నాం. అంబులెన్స్‌ కూడా ఉంటుంది. ఆస్పత్రుల్లో బెడ్‌ దొరికేవరకు ఇక్కడ చికిత్స ఇస్తాం. 
– మురళీధర్, ప్రెసిడెంట్, మై హోమ్‌ జ్యుయల్, కొండాపూర్‌ 

ఈ సెంటర్లకు మార్గదర్శకాలివీ..
అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం గత ఏడాది జూలైలోనే మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఆ మార్గదర్శకాలివీ.. 

  • కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు అనుమతి తీసుకోవాలి. సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. వీటిని సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలి. 
  • కమ్యూనిటీ హాల్, కామన్‌ ఏరియా, లేదా నివాసితులకు కాస్త దూరంగా ఉన్న ఖాళీగా ఫ్లా్లట్ల ఈ సెంటర్లకు ఉపయోగించుకోవాలి. ప్రత్యేకమైన ఎంట్రీ/ఎగ్జిట్, టాయిలెట్‌ ఉండాలి. 
  • కోవిడ్‌ అనుమానితులు, లక్షణాల్లేని, స్వల్ప లక్షణాలున్న వారికి మాత్రమే వినియోగించాలి. 
  • వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు, ఏవైనా తీవ్ర వ్యాధులున్న వారికి ఈ సెంటర్లను ఉపయోగించొద్దు. 
  • సెంటర్‌ కోసం ఏర్పాటు చేసుకునే వైద్యులు.. రోజూవారీగా పరీక్షలు నిర్వహించాలి. 
  • బెడ్స్‌ మధ్య కనీసం ఒక మీటర్‌ దూరం ఉండాలి. తగినంత వెలుతురు, గాలి అందేలా చూడాలి. 
  • వీటిలో ఉపయోగించిన లినెన్, పిల్లో కవర్స్, టవల్స్‌ను డిస్పోజబుల్‌ బ్యాగ్‌లో ఉంచాలి. వాటిని 72 గంటల తర్వాత రోగి నివాసంలో మాత్రమే ఉతకాలి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు