TRS టు BRS‌: పందికి లిప్‌స్టిక్‌ పూసినట్లే!.. ట్విటర్‌ టిల్లు..: బండి సంజయ్‌

5 Oct, 2022 19:57 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) కాస్త.. భారత్‌ రాష్ట్ర సమితి(BRS)గా మారిపోయింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇవాళ జరిగిన టీఆర్‌ఎస్‌ సర్వ సభ్య సమావేశంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. దీంతో దేశమంతటా కేసీఆర్‌ ప్రకటనను ఆసక్తికరంగా వీక్షించింది. అయితే.. 

కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు మాత్రం బీఆర్‌ఎస్‌పై వ్యంగ్యాస్త్రలు సంధిస్తున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ మారడం అనేది పందికి లిప్‌స్టిక్‌ పూసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ట్విటర్‌ టిల్లు ఏమో గేమ్‌ చేంజర్స్‌ అని ప్రకటించుకున్నాడు. కానీ, అయ్య ఏమో నేమ్‌ చేంజర్‌ అయ్యాడు. అంతిమంగా ఫేట్‌ ఛేంజర్స్‌ మాత్రం ప్రజలే అంటూ బీఆర్‌ఎస్‌ పరిణామంపై వ్యంగ్యంగా స్పందించారు  బండి సంజయ్‌ కుమార్‌. 

ఇక బీఆర్‌ఎస్‌ పరిణామం ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి కే కృష్ణ సాగర్‌ రావు. పేరు మార్చినంత మాత్రానా జాతీయ పార్టీ ఎలా అవుతుంది?. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే.. చాలా రాష్ట్రాల్లో గణించదగిన ఓటర్ల మద్దతు పొందాలి అని పేర్కొన్నారు. 

తెలంగాణ మోడల్‌ దేశమంతటా ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం జరిగిందని కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనా బీజేపీ సెటైర్లు పేల్చింది. తెలంగాణ మోడల్‌ అనేది కేవలం కేసీఆర్‌ ఊహ మాత్రమేనని అంటోంది. ‘‘పార్టీలు రావడం, మసకబారడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ప్రళయం రాబోతోందని ఒకప్పుడు కేసీఆర్‌ చెప్పారు. అదే ఇదే(బీఆర్‌ఎస్‌ ప్రకటన) అంటూ సెటైర్‌ పేల్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

మరిన్ని వార్తలు