కుమారుడి మృతదేహం వద్ద ఓ తండ్రి రోదన

27 Sep, 2022 04:40 IST|Sakshi

మేకలను మేపుతూ విద్యుత్‌ తీగకు తాకిన బాలుడు

అక్కడికక్కడే మృతి.. 

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

కేసముద్రం: ‘లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా. బాయి కాడికి పోదాం’అంటూ ఓ తండ్రి కుమారుడి మృతదేహాన్ని హత్తుకుంటూ గుండెలవిసేలా రోదించాడు. కోతుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు తన వరి పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ అభంశుభం తెలియని బాలుడిని బలితీసుకుంది. ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం మర్రితండాలో సోమవారం చోటుచేసుకుంది.

మర్రితండాకు చెందిన వాంకుడోతు నీల, బాసు దంపతులకు ఇద్దరు కుమారులు అశోక్, జీవన్‌(14) ఉన్నారు. చిన్నకుమారుడు జీవన్‌ చదువు మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. తోటిమిత్రులతో కలిసి జీవన్‌ మేకలను మేపేందుకు ఊరి చివరకు వెళ్లాడు. ఇదే గ్రామ శివారు చెరువు ముందు తండాకు చెందిన వాంకుడోతు బిచ్చు అనే రైతు, తన వరి పొలం చుట్టూ విద్యుత్‌ తీగను ఏర్పాటు చేశాడు. పొలం వైపుగా మేకలు వెళ్లకుండా చూసేందుకని అటుగా వెళ్లిన జీవన్‌ కాలుకు ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగ తాకడంతో షాక్‌కు గురై వెంటనే కుప్పకూలిపోయాడు.

గమనించిన మిత్రులు వాంకుడోతు గణేశ్, నవీన్, సూర్య అతన్ని బయటకు తీసేందుకు యత్నించగా, వారికి స్వల్పంగా విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో జీవన్‌ పంటపొలంలోనే మృతి చెందాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో బోరున విలపిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పంట యజమాని బిచ్చు ఇంటి ముందు జీవన్‌ మృతదేహాన్ని ఉంచి కుటుంబసభ్యులు, తండావాసులు ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

‘కరెంటుతీగ పెట్టి మా బిడ్డను కడుపున పెట్టుకున్నారు సార్‌.. మాకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నారు. చివరకు కుటుంబసభ్యులను, తండావాసులకు సర్దిచెప్పి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. 

కంటతడి పెట్టించిన తల్లిదండ్రుల రోదన
అప్పటి వరకు ఇంట్లో సరదాగా గడిపిన జీవన్‌ గంటల వ్యవధిలోనే శవమై కనిపించడంతో తల్లిదండ్రులైన నీలా, బాసు రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. బిడ్డా ఒక్కసారి లేవరా అంటూ ఆ తల్లి రోదించిన తీరు హృదయాలను బరువెక్కించింది. 

మరిన్ని వార్తలు