కృష్ణాపై 6 ప్రాజెక్టులకు లైన్‌క్లియర్‌ 

30 Jul, 2022 01:18 IST|Sakshi

కల్వకుర్తి, నెట్టెంపాడుకు మళ్లీ అనుమతుల నుంచి మినహాయింపు 

ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతలకు కూడా.. 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదిపై తెలంగాణలోని కల్వకుర్తి (అదనపు 15 టీఎంసీలతో సామర్థ్యం పెంచింది), నెట్టెంపాడు (సామర్థ్యం పెంచనిది)తోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతల పథకాలకు మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో ఈ ఆరు ప్రాజెక్టులను చేర్చి వాటి నిర్మాణం పూర్తికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న తెలంగాణ, ఏపీ వాదనలతో కేంద్ర జలశక్తి శాఖ ఏకీభవించింది.

ఈ ఆరు ప్రాజెక్టులకు మరోసారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇందుకు అనుగుణంగా 2021 ఏప్రిల్‌ 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌కు సవరణలు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ జాయింట్‌ సెక్రటరీ ఆనంద్‌ మోహన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏడాదిగా వివాదం: రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం ద్వారా కృష్ణా బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలతోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండకు ఏడాదిలోగా అపెక్స్‌ కౌన్సిల్‌ (కేంద్ర మంత్రి చైర్మన్‌గా, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులు) నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని గెజిట్‌లో రెండు రాష్ట్రాలను ఆదేశించింది.

కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని రెండు రాష్ట్రాలపై కృష్ణా బోర్డు ఒత్తిడి తెచ్చింది. గడువులోగా అనుమతులు పొందకుంటే పనులు నిలుపుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. విభజన చట్టం ద్వారా ఆ ఆరు ప్రాజెక్టులకు కేంద్రమే అనుమతి ఇచ్చిందని.. ఈ నేపథ్యంలో మళ్లీ వాటికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఇటు కృష్ణా బోర్డుకు, అటు కేంద్ర జలశక్తి శాఖకు ఇరు రాష్ట్రాలు స్పష్టం చేశాయి.

దీంతో ఈ ఆరు ప్రాజెక్టులకు తాజాగా కేంద్రం మినహాయింపు కల్పించింది. అనుమతుల కోసం వీటి డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్టుల నిర్వహణను మాత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కృష్ణా బోర్డుకు అప్పగించాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. 

నెట్టెంపాడు విస్తరణకు అనుమతి తప్పదు...
తెలంగాణ వచ్చాక కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా అదనంగా 15 టీఎంసీలు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా అదనంగా 2.5 టీఎంసీల కృష్ణా జలాల తరలింపునకు విస్తరణ పనులు చేపట్టగా కల్వకుర్తి విస్తరణకు మాత్రం కేంద్రం మినహాయింపు కల్పించింది.

దీంతో నెట్టెంపాడు విస్తరణ పనులకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని లేనిపక్షంలో పనులు నిలుపుదల చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. నెట్టెంపాడు విస్తరణతోపాటు తెలంగాణలో కృష్ణాపై నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఉదయసముద్రం, కోయిల్‌సాగర్, ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పథకాలు, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులకు అనుమతి తీసుకోవాల్సి రానుంది.   

మరిన్ని వార్తలు