బావిలో పడిపోయిన క్రేన్‌

26 Feb, 2021 04:19 IST|Sakshi

ఇద్దరు రైతుల దుర్మరణం

బావిలోని రాళ్లను తొలుస్తుండగా దుర్ఘటన

సాక్షి, హుస్నాబాద్‌: పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన యత్నం వారి ప్రాణాలనే హరించింది. బావిలో పనిచేస్తుండగా క్రేన్‌ మీద పడటంతో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం భల్లునాయక్‌ తండాలో గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. లావుడ్య దేవోజీ, ఇస్లావత్‌ దుర్గా బావ, బావమరుదులు. ఇద్దరికీ కలిపి పక్కపక్కనే మూడున్నర ఎకరాల పొలం ఉంది. అందులో వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇటీవల పెరిగిన ఎండలకు బావిలో నీరు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు నీటి కోసం బావిని మరింత లోతుగా తవ్వేందుకు క్రేన్‌ను కిరాయికి తెచ్చుకున్నారు. కూలీలను పెట్టుకునే స్తోమత లేకపోవడంతో దేవోజీ భార్య చాంది (45), కుమారుడు సాయికుమార్, తన సోదరుడు లావుడ్య బీమా (50), బంధువులు ఇస్లావత్‌ ఎంక్యా, లావుడ్య సరోజనను సాయంగా రప్పించుకున్నారు.

15 రోజుల నుంచి బావిలో బండరాళ్లను తొలిచే పనులు చేస్తున్నారు. గురువారం రాళ్లను తవ్వేందుకు దేవోజీ, బీమా, ఎంక్యా బావిలోకి దిగారు. పైన క్రేన్‌ ఆపరేటర్‌కు సాయంగా దుర్గా, చాంది, సాయికుమార్, సరోజన ఉన్నారు. క్రేన్‌ డబ్బాలో పెద్ద బండరాయి వేసి బయటకుతీసే యత్నంలో పైభాగంలో క్రేన్‌పై అందరూ నిలుచొని బరువును సరిచూశారు. అనంతరం బండరాయిని క్రేన్‌ ద్వారా పైకి తెచ్చిన తర్వాత దాన్ని పక్కకుతోసే సమయంలో క్రేన్‌పై నిలబడిన చాంది కిందికి దిగింది. దీంతో బరువు అంచనా తప్పి క్రేన్‌ మొత్తం బావిలో పడిపోయింది. చాంది క్రేన్‌తో సహా బావిలోపడి ప్రాణాలు కోల్పోయింది. బావిలో పనిచేస్తున్న వారిపై ఒక్కసారిగా క్రేన్‌ పడటంతో బీమా అక్కడికక్కడే మరణించగా ఎంక్యాకు తీవ్ర గాయాలయ్యాయి. బావిపైన ఉన్న వారు కేకలు వేయడంతో తండా నుంచి స్థానికులు వచ్చారు. తాళ్ల సాయంతో బావిలో ఉన్న వారిని బయటకు తీసి 108 వాహనం ద్వారా హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఇస్లావత్‌ ఎంక్యను వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా, లావుడ్య సరోజనను కరీంనగర్‌ ఆస్పతికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్సై శ్రీధర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు