ఇక పక్కాగా ప్రతి పంట లెక్క

13 Aug, 2021 02:24 IST|Sakshi

4–5 రోజుల్లో ప్రత్యేక సర్వేకు వ్యవసాయ శాఖ శ్రీకారం

ప్రతి రైతు పంట పొలం దగ్గరికి వెళ్లి నిర్ధారణ

క్లస్టర్‌ వారీగా డేటా సేకరించి పోర్టల్‌లో నమోదు

సాక్షి, హైదరాబాద్‌: పంట లెక్కల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సర్వే చేపట్టాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పంట లెక్కలను గ్రామాల్లో ఎవరో ఒకరి ద్వారా సేకరించి అంచనా వేస్తున్నారు. ప్రతిరోజూ స్థానిక ఏఈవోలు ఆయా సమాచారాన్ని సేకరించి అందజేస్తున్నారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలా సేకరించిన సమాచారం కచ్చితంగా ఉండట్లేదన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త సర్వేకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవో) వారి క్లస్టర్‌ పరిధిలోని ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి వాటిని స్వయానా చూసి రాసుకుంటారు. అలా ఏఈవోలు తమ పరిధిలోని దాదాపు 3–4 గ్రామాలు తిరిగి పక్కాగా లెక్కలు తీసుకుంటారు. అలా రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం, యాసంగిలకు సంబంధించిన లెక్కలను తీసుకుంటారు. దీంతో ప్రతి ఎకరాకు సంబంధించిన పంట లెక్కలను తీసుకుంటారు. ఆ సమాచారాన్ని వ్యవసాయశాఖ పోర్టల్‌లో పొందుపరుస్తారు. 

పథకాల అమల్లో స్పష్టత... 
పంట లెక్కలను పక్కాగా తీసుకోవడం వల్ల రైతులకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం, పథకాల అమల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు ఒక నిర్దేశిత గ్రామంలో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో తెలుసుకోవడం వల్ల ఆ గ్రామానికి ఎంత యూరియా అవసరం? ఎంత డీఏపీ కావాలి? ఎన్ని విత్తనాలు అవసరమన్న సమాచారాన్ని పక్కాగా అంచనా వేయొచ్చు. దీనివల్ల ఎక్కడా కొరత లేకుండా రైతులకు ఎరువులను అందజేసే వీలుంటుంది. అంతేకాదు పంట పండించాక ఆయా పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంలోనూ స్పష్టమైన నిర్ధారణకు రావడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఏ ప్రాంతంలో ఎటువంటి వసతులు కల్పించాలన్న దానిపై సూక్ష్మస్థాయిలో తెలుసుకోవచ్చు. మొత్తం పంటల డేటా సేకరణ వల్ల రైతులకు అవసరమైన అన్ని అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సర్వే కార్యక్రమాన్ని 4–5 రోజుల్లో ప్రారంభిస్తామని ఒక ఉన్నతాధికారి తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు