జగిత్యాలలో అరుదైన చేప.. ఇది ఉన్న చోట వేరే చేపలు బతకలేవ్‌!

8 Aug, 2021 12:10 IST|Sakshi

సాక్షి, జగిత్యాల:  తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని చెరువులు దాదాపు నిండుకుండను తలపించాయి. చెరువుల్లో చేపలు పట్టేందుకు మత్య్సకారులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చిక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపెళ్లి రాజనర్సకు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా.. దీనిని డెవిల్(దెయ్యం) చేప అంటారని, ఇది ఎక్కువుగా సముద్ర జల్లాల్లో మాత్రమే కనిపిస్తుంటుందని అధికారులు తెలిపారు. మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని పేర్కొన్నారు.

కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చలు, ముళ్లు ఉంటాయి. ఈ చేప సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. తాను ఎన్నో ఏళ్ల నుంచి చేపలు పడుతున్నా ఇలాంటి చేప ఎప్పుడూ చూడలేదని జాలరు రాజనర్సు తెలిపాడు. ఒంటినిండా జీబ్రా రకం గీతలతో కనిపించే ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మం కప్పబడినట్లు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేప నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్‌ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు