కొత్త వైరస్‌ ఆందోళన వద్దు!

27 Dec, 2020 00:40 IST|Sakshi

తీవ్రమైన వ్యాధిగా మారే లక్షణాలు కనిపించడం లేదు 

అప్రమత్తంగా లేకుంటే కేసుల సంఖ్య మాత్రం పెరగొచ్చు 

ఇది అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో మరణాలకు దారితీయొచ్చు 

వ్యాక్సిన్‌ వచ్చినా.. మరో మూడునాలుగు నెలలు జాగ్రత్తగా ఉండాలి 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె. శ్రీనాథ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వైరస్‌తో తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. ఎక్కువ మందికి సోకి కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రముఖ వైద్యులు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డా. కె. శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది మరణాల సంఖ్య అధికం కావడానికి పరోక్షంగా కారణం కావొచ్చన్నారు. అందువల్ల ఇది వ్యాప్తి చెందకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కరోనా కొత్త వైరస్‌ వ్యాప్తిపై శనివారం ‘సాక్షి’కి డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

వైరస్‌ రూపురేఖల మార్పుతోనే... 
ఏ వైరస్‌ అయినా స్వాభావికంగా తన రూపురేఖలు మార్చుకోవడం సహజమే. యూకేలో సెప్టెంబర్‌లోనే ఈ వైరస్‌ కనపడినా డిసెంబర్‌లో దానిని కొత్త రకంగా గుర్తించి.. కేసులు వేగంగా వ్యాప్తి చెందడాన్ని కనుగొన్నారు. యూకేతో పాటు సౌతాఫ్రికా, నైజీరియా వంటి దేశాల్లోనూ కొత్త మ్యుటేషన్లు వచ్చాయంటున్నారు. వీటి వల్ల వైరస్‌ వ్యాప్తి పెంచుకుంటుంది.  చదవండి: (ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!)

అడ్డంకులు దాటేందుకు...
మాస్క్‌లు ధరించడం, ఇతరత్రా పద్ధతుల ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పుడు వైరస్‌ రూపాన్ని మార్చు కుంటుంది. ఎక్కువ మందికి వ్యాప్తి చెందేందుకు ఈ అడ్డంకులను అధిగమించేందుకు తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. అయితే దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.  

అప్రమత్తత అవసరం... 
ఈ కొత్త వైరస్‌ ఇప్పటికైతే ప్రమాదకరంగా మారే లక్షణాలు కనిపించడం లేదు. అయితే వైరస్‌ పెరగకపోయినా, తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. అధిక వ్యాప్తి కారణంగా ఎక్కువ మంది ఈ వైరస్‌ బారినపడతారు. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరిగి ఆసుపత్రులు, వైద్య వ్యవస్థపై తాకిడి, ఒత్తిళ్లు పెరుగుతాయి. క్రమంగా ఈ కేసుల్లో మరణాల సంఖ్య ఎక్కువయ్యే అవకాశాలుండొచ్చు.  

ప్రత్యేక టెస్టింగ్‌లు అవసరం... 
కొత్త వైరస్‌ సెప్టెంబర్‌లోనే బయటపడినందున.. భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఇది ఇప్పటికే చేరుకుని ఉండొచ్చు. దీని జెనిటిక్‌ స్ట్రక్చర్‌ తెలుసుకునేందుకు ‘సైంటిఫిక్‌ టెస్టింగ్‌’ద్వారా ప్రత్యేక పరీక్షలు చేయాలి. బ్రిటన్, సౌతాఫ్రికా, ఐరోపాలో ని కొన్ని దేశాల్లోని ల్యాబ్‌లలో తరచుగా ఈ టెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా పరిస్థితిపై మరింత సమాచారం కోసం వేచిచూడాలి.  

జనవరిలో వ్యాక్సిన్‌... 
భారత్‌లో తయారవుతున్న ఆస్ట్రా జెనెకా(బ్రిటన్‌ది) వ్యాక్సిన్‌ జనవరి 1, 2 వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి బ్రిటీష్‌ రెగ్యులేటర్‌ అనుమతి లభించాలి. భారత్‌ బయోటెక్, రష్యన్‌ వ్యాక్సిన్‌ స్టేజ్‌–3 ప్రయోగాలు పూర్తయ్యాక వాటి డేటా ఇవ్వాలి. భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలు ఇక్కడే జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో వీటికి అనుమతి రావొచ్చు. రెగ్యులేటరీ ఏజెన్సీలు, ఇంటర్నేషనల్‌ అప్రూవల్స్‌పై ఇది ఆధారపడి ఉంది.  

మరో 3, 4 నెలలు జాగ్రత్త... 
వ్యాక్సిన్‌ డోసులు 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు తీసుకున్నాక, 14 రోజుల తర్వాతే యాంటీబాడీస్‌ ఏర్పడి రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశాలున్నాయి. అదీ కాకుండా మొదట ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌.. తర్వాత క్లిష్టమైన అనారోగ్యంతో ఉన్న వారు.. ఇలా అంచెలంచెలుగా వ్యాక్సిన్లు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుంది. అందువల్ల మరో 3, 4 నెలల దాకా అందరూ బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. అప్పటివరకు వైరస్‌కు సంబంధించిన పరిస్థితులు, మనం తీసుకున్న చర్యల ప్రభావంపై స్పష్టత వస్తుంది.  

సెకండ్‌ వేవ్‌ ప్రభావం... 
మన దేశంలో సెకండ్‌ వేవ్‌ వస్తే తీవ్రత ఉండబోదని చెప్పలేం. పశ్చిమ దేశాల్లో నిబంధనలు పాటించకుండా స్వేచ్ఛగా తిరగ డం, విందులు, వినోదాల్లో మునిగితేలడం వల్ల విపత్కర పరిస్థి తులు ఏర్పడ్డాయి. ఇక్కడా అజాగ్రత్తగా ఉంటే కేసులు పెరగొచ్చు.

హెర్డ్‌ ఇమ్యూనిటీపై చెప్పలేం... 
భారత్‌లో ఎంత శాతం మందిలో ఇమ్యూనిటీ ఏర్పడితే..æ హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందనేది చెప్పలేం. అది వచ్చినా కొన్ని ప్రదేశాలు, ప్రాంతాలకు పరిమితం కావొచ్చు. ఒక ప్రాంతంలోని ఇమ్యూనిటీ ఏర్పడిన ప్రజల్లోంచి ఎవరైనా ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు సొంతంగా రోగ నిరోధకశక్తి లేకపోతే వైరస్‌ బారినపడే అవకాశాలున్నాయి.     అందువల్ల అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

గ్రామీణ జనాభా ఎక్కువ కాబట్టే... 
యూఎస్, యూకే, ఐరోపా దేశాలతో పోలిస్తే.. భారత్‌లో యువత అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా ఎక్కువకావడం, అక్కడి వారికి అనారోగ్య లక్షణాలు తక్కువగా ఉండటం, చిన్నప్పటి నుంచే వివిధ టీకాలు తీసుకోవడం వంటి కారణాలతో కరోనా వైరస్‌ నుంచి కొంతమేర ఇమ్యూనిటీకి కారణమై ఉండొచ్చు. అందువల్లే కరోనా కేసుల తీవ్రత పెరగకపోవడంతోపాటు మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండేందుకు కారణం కావచ్చు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇతర దక్షిణాసియా దేశాల్లోనూ కేసుల సంఖ్య ఎలా ఉన్నా కోవిడ్‌ మరణాలు తక్కువగానే ఉన్నాయి. భారతీయులు జన్యుపరంగా స్ట్రాంగ్‌గా ఉన్నారా.. అన్నది పరిశోధనలతోనే తేల్చాలి. 

కొత్త వైరస్‌పైనా వ్యాక్సిన్‌... 
ఇప్పటికే సిద్ధమైన వివిధ వ్యాక్సిన్లు కొత్త వైరస్‌పైనా పనిచేస్తాయని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్‌ కారణంగా ‘స్పైక్‌ ప్రోటీన్‌’ కొంత రూపుమారినా దానిపైనా వ్యాక్సిన్‌ పనిచేస్తుంది. అయితే, ఈ వైరస్‌ మరింత అధికంగా రూపు మార్చుకుంటే మాత్రం దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్‌లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చు. వైరస్‌ తీవ్రత మరింత పెరిగినా ఇప్పటికే ఇస్తున్న చికిత్స, మందులు పనిచేస్తాయి. ఎక్కువ మందికి వైరస్‌ సోకితే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదం పెరగొచ్చు.  

సాధారణ పరిస్థితులకు ఏడాది... 
మన దేశంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరో ఏడాది పట్టే అవకాశాలున్నాయి. వచ్చే ఏప్రిల్‌ కల్లా కరోనా వైరస్‌ తీరుతెన్నులు, దాని అదుపునకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ప్రభావం చూపాయి.. వ్యాక్సిన్‌ వినియోగం తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. కరోనా వైరస్‌ విషయంలో భయాందోళనకు గురికాకుండా, పూర్తిస్థాయి కట్టడితోపాటు మళ్లీ వస్తే ఎదుర్కొనేందుకు ఏమి చేయాలన్నది తేలుతుంది. 

జాగ్రత్తలే రక్షణ కవచం... 
పశ్చిమ దేశాల్లో అత్యంత శీతల పరిస్థితులు ఉన్నందున కొంత వేగంగా కేసుల వ్యాప్తి జరుగుతోంది. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినందున అక్కడ ఎక్కువ ప్రభావం ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాదిలో పండుగల ప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కేసుల పెరుగుదలకు అడ్డుకట్టవేయొచ్చు. ప్రస్తు తం తలెత్తిన కొత్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే. వైరస్‌ సోకినట్లు అనుమానం వస్తే వెంటనే టెస్ట్‌ చేయించుకోవాలి. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజేషన్‌ లాంటి జాగ్రత్తలే రక్షణ కవచం.   

మరిన్ని వార్తలు