విద్యుత్‌ బిల్లుల ఎత్తి‘మోత’లు

14 Jan, 2022 01:38 IST|Sakshi

ఏటేటా పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

2022–23లో ఏకంగా 13,826 ఎంయూల వినియోగం అంచనా

ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.7,660 కోట్లు 

ఏఆర్‌ఆర్‌ నివేదికలో డిస్కంల స్పష్టీకరణ 

సబ్సిడీ విద్యుత్‌ కింద చెల్లించాల్సిన మొత్తం మరో రూ.5,652 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ బిల్లులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ వినియోగం 2020–21లో 3,575 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 2021–22లో 4,282 ఎంయూలకు పెరిగింది. 2022–23లో వీటికి ఏకంగా 13,826 ఎంయూల విద్యుత్‌ అవసరం కానుందని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనా వేశాయి.

ఈ మేరకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల విద్యుత్‌ బిల్లులను చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌) నివేదిక–2022–23లో స్పష్టం చేశాయి. మరోవైపు రూ.5,652 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీలను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. ఈ సబ్సిడీ, ఎత్తిపోతల పథకాల బిల్లులు కలిపి 2022–23లో డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.13,312 కోట్లను చెల్లించాల్సి ఉండనుంది. 

దక్షిణ డిస్కంలో ఇలా.. 
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,617 ఎంయూల విద్యుత్‌ వినియోగించగా, 2021–22లో 13 శాతం అదనంగా 1,830 ఎంయూలను వినియోగించాయి. కాగా 2022–23లో ఏకంగా 190 శాతం అదనంగా 5,325 ఎంయూల విద్యుత్‌ వినియోగించనున్నాయని దక్షిణ డిస్కం అంచనా వేసింది.

2021–22లో ఎత్తిపోతల పథకాల బిల్లుల ద్వారా రూ.1,211.89 కోట్లను సంస్థ ఆర్జించగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.21,820.56 కోట్లలో ఇది 5 శాతం ఉంటుందని అంచనా. 2022–23లో రూ. 2,505.05 కోట్లను ఆర్జించనుండగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.24,610.33 కోట్లలో ఎత్తిపోతల బిల్లుల వాటా 10 శాతం ఉంటుందని అంచనా వేసింది.

ఉత్తర డిస్కం పరిస్థితి ఇదీ..  
ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,958 ఎంయూల విద్యుత్‌ను వాడగా, 2021–22లో 25 శాతం వృద్ధితో 2,452 ఎంయూలు వినియోగించాయి. 2022–23లో ఏకంగా 246 శాతం వృద్ధితో 8,501 ఎంయూల విద్యుత్‌ అవసరం కానుందని ఉత్తర డిస్కం అంచనా వేసింది.

సంస్థకు 2021–22లో రూ.7,175 కోట్ల వార్షిక ఆదాయం అంచనా కాగా, అందులో రూ.1,646 కోట్ల (23 శాతం)ను ఎత్తిపోతల విద్యుత్‌ బిల్లుల రూపంలో ఆర్జించనుంది. 2022–23లో సంస్థకు రూ.10,703 కోట్ల వార్షిక ఆదాయం రానుందని అంచనాలుండగా, అందులో ఏకంగా రూ.5,155 కోట్లు (48శాతం) ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ బిల్లుల రూపంలో రానున్నాయి.

>
మరిన్ని వార్తలు