'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్‌

29 Jan, 2023 05:54 IST|Sakshi

పార్టీలో చేరేవారి పేర్లు ముందే లీకవడం ఏమిటన్న సందేహాలు

అలాంటి నేతలెవరని ఆరా

కోవర్టులను గుర్తించడం, కట్టడి చేయడంపై ఫోకస్‌

కొద్ది నెలల్లోనే ఎన్నికలున్నా అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకులాట.. చేరికకు ఇతర పార్టీల నేతల తర్జనభర్జన

అన్ని పార్టీల్లో కేసీఆర్‌ మనుషులు ఉన్నారన్న ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై బీజేపీలో చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్‌ కోవర్టులు, ఇన్‌ఫార్మర్లు ఉన్నారన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు కాషాయదళంలో తీవ్ర కలకలానికి దారితీశాయి. బీజేపీలో నిజంగానే కేసీఆర్‌ ఇన్‌ఫార్మర్లు ఉన్నారా? ఉంటే అలాంటి నాయకులెవరు? కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తున్నది ఎవరు? అసలు ఈటల ఉద్ధేశం ఏమిటన్న అంతర్గత చర్చకు కారణమయ్యాయి. ఈ సందేహాలను బలపర్చేలా ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్తున్నారంటూ కొందరు నేతల పేర్లు ప్రాథమిక చర్చల సమయంలోనే లీకవడంపై రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కోవర్టులను గుర్తించి, కట్టడి చేయడంపై బీజేపీ ముఖ్యులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. 

చేరికలకు ఇబ్బందిగా లీకులు 
రాష్ట్ర కాంగ్రెస్‌లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారంటూ కొందరు నేతలు చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇటీవల ఆ పారీ్టలో రచ్చకు కారణమయ్యాయి. పార్టీ వర్గాలు చీలి పోయి, ఆరోపణలు ప్రత్యారోపణల దాకా పరిస్థితి వెళ్లింది. ఇదే సమయంలో బీజేపీ సహా అన్ని పార్టీల్లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారంటూ ఈటల రాజేందర్‌ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈటల ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచి్చందనే దాని నుంచి.. బీజేపీలో ఎవరు కోవర్టులనే దాకా ఆ పార్టీ నాయకుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ఇటీవల మీడియా ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఆఫ్‌ ది రికార్డ్‌గా ఈటల చేసిన వ్యాఖ్యలపైనా చర్చజరుగుతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ కనీ్వనర్‌గానూ ఈటల వ్యవహరిస్తున్నారు. అలాంటిది తానే స్వయంగా కోవర్టుల ఆరోపణలు చేయడం, బీజేపీలో చేరబోయే ఇతర పారీ్టల నేతల పేర్లు ముందుగానే లీక్‌ కావడంతో వారు వెనుకడుగు వేస్తున్నారని వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఏ రాజకీయ పారీ్టలోనూ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ లేదని.. బీజేపీలో కమిటీ ఏర్పాటు చేసినా చేరబోయే నేతల పేర్లు ప్రాథమిక దశలోనే ఎలా లీక్‌ అవుతున్నాయని పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

కోవర్టుల కట్టడి ఎలా? 
ఒకవేళ బీజేపీలో కేసీఆర్‌ కోవర్టులు, ఇన్‌ఫార్మర్లు ఉంటే వారు ఏ స్థాయిలో ఉన్నారు? వారిని ఎలా గుర్తించాలనే చర్చ కూడా సాగుతోంది. అలాంటి వారిని ఆధారాలతో గుర్తించడంతోపాటు కట్టడి చేయడం, అవసరమైతే పక్కనపెట్టడం ఎలాగన్న ఆలోచనలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అయితే ఈ కోవర్టులు/ఇన్‌ఫార్మర్ల అంశం మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే తెరపైకి వచి్చంది. ఉప ఎన్నికను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాయి. అధికార పార్టీ అభ్యర్థిని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓడిస్తే.. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మరింత సానుకూలత వస్తుందని, బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆశించాయి. ఇక ఈ ఉప ఎన్నికలో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డినా.. రాజగోపాల్‌రెడ్డి ఓటమి చెందడానికి కేసీఆర్‌ కోవర్టులే కారణమనే ఆరోపణలు వచ్చాయి. మునుగోడు పోలింగ్‌కు కేవలం కొన్నిరోజుల ముందు.. కొందరు నేతలు తిరిగి కేసీఆర్, కేటీఆర్‌ల సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చింది. మునుగోడులో బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలను కోవర్టుల ద్వారా తెలుసుకోవడం వల్ల పారీ్టకి నష్టం జరిగిందన్న చర్చ జరిగింది.  
 
ఇంకా అభ్యర్థుల కోసమే..! 
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలలు కూడా లేదు. అయినా బీజేపీకి మెజారిటీ సీట్లలో బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట తప్పడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు వేసుకున్న అంచనాల ప్రకారం.. 30 చోట్ల మాత్రమే బలమైన అభ్యర్థులు, మరికొన్నిచోట్ల ఫర్వాలేదనే స్థాయిలో అభ్యర్థులు ఉన్నారని.. చాలాచోట్ల గట్టి అభ్యర్థులను వెతకాల్సిన పరిస్థితి ఉందని అంటున్నాయి. బీజేపీలో టికెట్‌ కేటాయింపుపై భరోసా, ఇతర అంశాలపై స్పష్టత రానందునే.. నేతల చేరికలు ముందుకు పడటం లేదని పేర్కొంటున్నాయి.  

ఈటల ఉద్దేశమేమిటి? 
‘ఆశించిన మేర బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ముఖ్య నేతలు ఇంకా బీజేపీలో చేరకపోవడానికి కోవర్టు రాజకీయాలే ప్రధాన కారణమనే అభిప్రాయంతో ఈటల ఉన్నారా? లేక బీజేపీలో కుదురుకునే విషయంలో ఈటల ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు?’ అనే చర్చ బీజేపీలో నడుస్తోంది. గతంలో బీఆర్‌ఎస్‌లో నంబర్‌–2గా ఉంటూ కేసీఆర్‌ పన్నే రాజకీయ వ్యూహాలు, ఆయా సందర్భాల్లో వ్యవహరించే తీరు తెలిసిన వ్యక్తిగా ఈటలకు బీజేపీ జాతీయ నాయకత్వం తగిన ప్రాధాన్యతే ఇస్తోందని పారీ్టవర్గాలు చెప్తున్నాయి. మరి ఆయన రాష్ట్రపారీ్టలో ఇంకా పూర్తిగా ఇమడలేకపోతున్నారా? తగిన గౌరవం, ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తితో ఉన్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది.

మరిన్ని వార్తలు