ఏపీపీల భర్తీకి 263 రోజులా?

9 Jul, 2021 01:21 IST|Sakshi

నియామక ప్రక్రియను కుదించండి: హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టుల భర్తీకి 263 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఏపీపీలు లేక క్రిమినల్‌ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో నియామక ప్రక్రియ వ్యవధిని కుదించాలని ఆదేశించింది. ఏపీపీలను భర్తీ చేయాలంటూ 2018 నుంచి చెబుతున్నా.. మూడేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చి 9 నెలల సమయం కోరడం ఏంటని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో ఏపీపీల ఖాళీలు ఉన్నాయని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాసినలేఖను ధర్మాసనం 2018లో సుమోటో వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. తాజాగా ఈ పిల్‌ విచారణకు రాగా.. ఈనెల 6న ఏపీపీ ఖాళీలు గుర్తిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చామని పేర్కొం ది. విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది.

వయోపరిమితి పెంచాలి 
ఏపీపీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేం దుకు వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచాలి. ఉమ్మడి ఏపీలో 2013లో ఈ పోస్టులు భర్తీ చేశారు. ఏ పోస్టులకైనా వయోపరిమితి 10 ఏళ్లకు పెంచుతూ 2017లో ప్రభుత్వం జారీచేసిన జీవోను ఈ పోస్టుల భర్తీకి వర్తింపజేయాలి. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఈ పోస్టులకు వయోపరిమితిని జనరల్‌ అభ్యర్థులకు 42 ఏళ్లుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిని 47 ఏళ్లుగా పేర్కొంది. ఇలాగే ఇక్కడా వయోపరిమితి పెంచాలి.  
– వి.రవికుమార్, న్యాయవాదుల జేఏసీ  

మరిన్ని వార్తలు