GHMC: చెరువుకు ఏదీ ఆదరువు?

28 Dec, 2021 19:27 IST|Sakshi

గ్రేటర్‌ జలాశయాలపై నిర్లక్ష్యం నీడలు

ఎన్‌జీటీ ఆదేశాలు బేఖాతరు

కబ్జాలో పలు చెరువులు

కాలుష్య కాసారాలుగా మరికొన్ని...

సాక్షి, హైదరాబాద్‌: మహానగరానికి మణిహారంలా ఉన్న జలాశయాల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో సర్కారు విభాగాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న వందలాది జలాశయాలు కబ్జాలతో కుంచించుకుపోయాయి. మరికొన్నింట గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల వ్యర్థజలాలు చేరి వాటిని కాలుష్య కాసారాలుగా మార్చివేశాయి. ఈ విషయంలో ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ, పీసీబీ, పరిశ్రమలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ తదితర విభాగాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయాల పరిరక్షణ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ పలు సందర్భాల్లో జారీచేసిన మార్గదర్శకాలను సర్కారు యంత్రాంగం అమలు చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. 

చెరువులకు శాపం ఇలా... 
► పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది.

► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతున్నాయి. దీంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి.

► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్‌ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం.

► సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనేఈ దుస్థితి తలెత్తింది.

► గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి.

► చాలా చెరువులు తమ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కిశల్యమై కనిపిస్తున్నాయి. 

పైపై మెరుగులకే జీహెచ్‌ఎంసీ ప్రాధాన్యం
► రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మా త్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీ లో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.  

రక్షణ చర్యలు తీసుకోవాలిలా... 
► చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్‌ అవర్‌ అర్భన్‌లేక్స్‌ సంస్థ పలు సూచనలు చేసింది.

► గ్రేటర్‌ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. 

► జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి.

► చెరువుల్లో ఆక్సిజన్‌ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్‌ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. 

► గృహ,వాణిజ్య,పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. 

► ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి.

► అన్యాక్రాంతం కాకుండా ఎఫ్‌టీఎల్‌ బౌండరీలు,రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి. 

జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. 
► వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.

► జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి.

► కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలి.  

మరిన్ని వార్తలు