28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు మద్దతు 

21 Mar, 2022 02:11 IST|Sakshi

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్‌ యూనియన్లు ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్‌ఎస్‌కేవీ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. సార్వత్రిక సమ్మె విజయవంతానికి అన్ని ట్రేడ్‌ యూనియన్లతో ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్‌హౌజ్‌లో తెలంగాణ రాష్ట్ర సన్నాహక సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పీఎస్‌యూల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. లాభాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించిందన్నారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, టీఆర్‌ఎస్‌కేవీ, ఐఎఫ్‌టీయూ, రైల్వే, బ్యాంక్, బీడీఎల్, హెచ్‌ఏఎల్, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర సంస్థల కార్మిక సంఘాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, పీఎస్‌యూ కార్మిక సంఘాల రాష్ట్ర కన్వీనర్‌ వి.దానకర్ణాచారి, రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ఎల్‌.రూప్‌ సింగ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు