కేసీఆర్‌ సాధించిన తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌: కేటీఆర్‌

6 Jul, 2022 02:34 IST|Sakshi
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్‌ తదితరులు 

‘కేసీఆర్‌ – ది ఆర్ట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌’ పుస్తకం ఆవిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌: ఎవరితోనూ సాధ్యం కాని తెలంగాణను సాధించి, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న నేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కె.తారకరామారావు అన్నారు. నంది అవార్డు సాధించిన రచయిత, సినీ దర్శకుడు మనోహర్‌ చిమ్మని రచించిన ‘కేసీఆర్‌–ది ఆర్ట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌’పుస్తకాన్ని ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏళ్ల ప్రజల స్వప్నం తెలంగాణను కేసీఆర్‌ సాకారం చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు.

ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డ్‌ టైంలో నిర్మించడంతో పాటు కనీవినీ ఎరుగని ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంత చేస్తున్నా కేసీఆర్‌ను కొందరు దూషిస్తున్నారని, అనరాని మాటలంటున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సమయంలో మనోహర్‌ చిమ్మని లాంటి రచయిత శ్రమించి కేసీఆర్‌ మీద ఒక మంచి పుస్తకం తీసుకురావడం నిజంగా హర్షణీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్‌ అధినేత పరమేశ్వర్‌రెడ్డి బైరి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు