ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి లింక్‌రోడ్లు

10 Nov, 2020 03:01 IST|Sakshi

పెరుగుతున్న జనాభాకనుగుణంగా మౌలిక వసతులు 

నగరవ్యాప్తంగా 137 లింక్‌ రోడ్ల నిర్మాణం 

తొలిదశలో 37 లింక్‌రోడ్లు.. వీటిల్లో ఇప్పటికే కొన్ని పూర్తి 

మున్సిపల్‌ మంత్రి కె. తారక రామారావు

సాక్షి, హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి, కాలుష్యనియంత్రణకు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా 137 లింక్, స్లిప్‌రోడ్లు నిర్మిస్తున్నామని మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మొదటిదశలో చేపట్టిన 37 లింక్‌రోడ్ల(126 కి.మీ.)లో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మిగతావి పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. లింక్‌రోడ్లకు ఇప్పటికే రూ.313.65 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ఆకర్షణీయ నగరం హైదరాబాద్‌ అని పేర్కొన్నారు. తగిన జీవన ప్రమాణాలతో నివాసయోగ్యమైన నగరంగా జేఎల్‌ఎల్, మెర్సర్‌ వంటి సంస్థల సర్వేల్లో వెల్లడైందని చెప్పారు.

ఓల్డ్‌ బాంబే హైవే నుండి రోడ్‌ నంబర్‌ 45 మార్గంలో రూ. 23.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్‌పాస్‌ పనులకు శంకుస్థాపనతోపాటు ఓల్డ్‌ బాంబే హైవే నుండి ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ మీదుగా ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వరకు రూ.19.51 కోట్ల వ్యయంతో 2.30 కిలోమీటర్ల మేర లింక్‌రోడ్డు, ఓల్డ్‌ బాంబే హైవే లెదర్‌ పార్కు నుండి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 వరకు రూ.15.54 కోట్ల వ్యయంతో 1.20 కిలోమీటర్ల లింక్‌ రోడ్డు, మియాపూర్‌ రహదారి నుండి హెచ్‌టీ లైన్‌ వరకు రూ. 9.61 కోట్ల వ్యయంతో కిలోమీటరు దూరంతో నిర్మించిన మరో లింక్‌ రోడ్డును కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాజాగూడలో విలేకరులతో మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని, నగరంలో గత ఆరేళ్లలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.  

ప్రజల సూచనలు, సలహాలు స్వీకరిస్తాం.. 
నగర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. లింకురోడ్ల గురించి సోషల్‌ మీడియా, పబ్లిక్‌డొమైన్‌లో పెడతామని, వీటిపై ప్రజల సూచనలు, సలహాలు, స్వీకరించి అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని లింక్‌రోడ్లు నిర్మిస్తామన్నారు. ఖాజాగూడ కొత్తరోడ్డు పక్కనే ద్వీపంలా పెద్ద చెరువు ఉన్నందున దీన్ని నెక్లెస్‌రోడ్డు తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సంజీవయ్యపార్కు, దుర్గంచెరువు, ఇతర చెరవులను అభివృద్ధి చేసినట్లుగానే ఈ చెరువును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రజలంతా వీకెండ్స్‌లో సేదతీరేలా మార్చాలన్నారు. కార్యక్రమాల్లో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తల సాని శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే గాంధీ, మేయ ర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా