కాకినాడ నుంచి స్విగ్గీలో స్వీట్లు ఆర్డర్‌.. 3 గంటలు డెలివరీ ఆలస్యం కావడంతో

10 Sep, 2022 13:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాకినాడ నుంచి స్విగ్గీలో ఆర్డర్‌ చేసిన స్వీటు.. నానక్‌రాంగూడకు డెలివరీ ఆలస్యం కావడంతో ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సురేష్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా.. కాకినాడలో ఉండే సాయిశ్రీ స్విగ్గీలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వీట్‌ ఆర్డర్‌ చేయగా నానక్‌రాంగూడలో గోల్ప్‌ ఎడ్జ్‌ ఫ్లాట్‌ నెంబర్‌ 1804లో ఉంటున్న భాస్కర్‌కు చేరాల్సి ఉంది. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన షేక్‌ అమీర్‌  బైక్‌పై బయలుదేరాడు.

వర్షం పడటంతో రాంగ్‌ లొకేషన్‌ చూపించడంతో ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్డుకు వెళ్లాడు. అక్కడి నుంచి యువతికి ఫోన్‌ చేయగా డెలివరీ అడ్రస్‌ లొకేషన్‌ పంపించింది. దీంతో గోల్ప్‌ ఎడ్జ్‌కు చేరుకునే సరికి సాయంత్రం 6 గంటలైంది. డెలివరీ తీసుకోమని స్నేహితుడు చెఫ్‌ శివ ప్రసాద్‌కు చెప్పి భాస్కర్‌ బయటకు వెళ్లాడు. డెలివరీ ఆలస్యమైందని చెఫ్‌ దురుసుగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

దీంతో శివప్రసాద్‌ ఇంట్లో నుంచి కత్తి తెచ్చి దాడి చేయగా ప్రతిఘటించిన షేక్‌ అమీర్‌ కుడి చేతిపై గాయమైంది. అమీర్‌ అదే కత్తిలో శివప్రసాద్‌ మెడ, ఛాతి, చేతిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో చెఫ్‌ శివప్రసాద్, డెలివరీ బాయ్‌ షేక్‌ అమీర్‌పై   కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
చదవండి: స్విగ్గీలో ఐస్‌క్రీం, చిప్స్‌ ఆర్డర్‌ చేస్తే.. డెలీవరీ చూసి షాక్‌ అయిన వ్యక్తి

మరిన్ని వార్తలు