Asia Cup 2022: టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన బ్యాట్‌ను వేలానికి పెట్టిన పాక్‌ ప్లేయర్‌

10 Sep, 2022 13:55 IST|Sakshi

Naseem Shah: ఆసియా కప్‌-2022లో పాకి​స్తాన్‌ను ఫైనల్స్‌కు చేర్చడానికి, టీమిండియాను పరోక్షంగా ఇంటికి పంపడానికి కారణమైన బ్యాట్‌ను వేలానికి పెట్టాడు పాక్‌ యువ పేసర్‌ నసీమ్‌ షా. సూపర్‌-4 దశలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన కీలక సమరంలో నసీమ్‌ షా.. సహచరుడు మహ్మద్‌ హస్నైన్‌ నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో చివరి ఓవర్‌ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి (విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో), ఓటమి అంచుల్లో ఉన్న పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 

వరుస సిక్సర్లు బాది రాత్రికిరాత్రే హీరో అయిపోయిన నసీమ్‌.. తను సిక్సర్లు కొట్టడానికి తోడ్పడిన బ్యాట్‌ను వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వేలం​ ద్వారా వచ్చే డబ్బును పాక్‌ వరద బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని తెలిపాడు. ఈ విషయాన్ని పాక్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

కాగా, గత నెల రోజులుగా పాకిస్తాన్‌ మునుపెన్నడూ లేని వరదల ధాటికి అతలాకుతలమైంది. వందల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. కనీవినీ ఎరుగని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించింది పాక్‌ ప్రభుత్వం. భారత్‌ సహా చాలా దేశాలు పాక్‌కు తోచిన సాయం చేశాయి. తాజాగా పాక్‌ యువ క్రికెటర్‌ నసీమ్‌ షా సైతం తనవంతు సాయంగా బ్యాట్‌ వేలం ద్వారా వచ్చిన సొమ్మును వరద బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని తెలిపాడు. 

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో టీమిండియా వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో శ్రీలంక, పాక్‌ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం జరిగే తుదిపోరులో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూపర్‌-4 దశ చివరి మ్యాచ్‌లో పాక్‌ను మట్టికరిపించిన లంక​ జట్టు ఆత్మ విశ్వాసంతో ఉరకలేస్తుంది. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ టైటిల్‌ను ఎగరేసుకుపోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పాక్‌ సైతం ఆసియా ఛాంపియన్‌గా నిలిచేందుకు ఉవ్విళ్ళూరుతుంది. 
చదవండి: గ్రౌండ్‌లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్‌ షాక్‌!

మరిన్ని వార్తలు