పోలీసుల అదుపులో కోల్‌ మాఫియా గ్యాంగ్

31 Jul, 2020 16:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బొగ్గును అక్రమ రవాణా చేస్తున్న కోల్‌ మాఫియా గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నల్లబొగ్గు అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. 1,050 టన్నుల బొగ్గును సీజ్ చేశాం. నిందితల నుంచి రెండు లక్షల యాభై వేల నగదు, రెండు లారీలతో సహా దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం బొగ్గు మాఫియాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాం.

ఇబ్రహీంపట్నం రాందాస్‌పల్లిలో డంపింగ్ యార్డ్ తయారు చేసుకుని ముఠా కోల్ మాఫియా కొనసాగిస్తున్నట్లు గుర్తించాం. అక్రమంగా లారీ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం నడిపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ యార్డ్‌కు తెసుకొచ్చి వాటిని కల్తీ చేసి వివిధ ప్రాంతాలకు పంపుతారు. కృష్ణ పట్నం, కొత్తగూడెం నుంచి బొగ్గు సరఫరా ఎక్కువగా అవుతుంది. ఇతర రాష్ట్రాల సిమెంట్, ఐరన్ ఫ్యాక్టరీలకు బొగ్గును సరఫరా చేస్తారు. క్వాలిటీ ఉన్న బొగ్గులో నాణ్యత లేని వాటిని మిక్స్‌చేసి పలు కంపెనీలకు సరఫరా చేస్తారు' అని మహేష్‌ భగవత్ ‌తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు