ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం

14 Jan, 2022 14:29 IST|Sakshi
యువకుడిని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

సాక్షి, శంకరపట్నం(కరీంనగర్‌): ఓ యువకుడు తనను ఉద్యోగంలోకి తీసుకోలేదని మనస్తాపానికి గురై, ఆత్మహత్యాయత్నం చేశాడు. కేశవపట్నం ఎస్సై ప్రశాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలంలోని అర్కండ్ల గ్రామానికి చెందిన యేమునూరి నవీన్‌ బీటెక్‌ వరకు చదువుకొని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బీటెక్‌లో ఒక సబ్జెక్ట్‌ ఫెయిలవడంతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటికి వచ్చాడు.

తిరిగి బుధవారం కంపెనీకి వెళ్లగా యాజమాన్యం అతన్ని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో నవీన్‌ కేశవపట్నం వచ్చాడు. తండ్రికి ఫోన్‌ చేసి, తాను విషపు గుళికలు మింగినట్లు చెప్పాడు. కంగారు పడిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఎస్సై ప్రశాంత్‌రావు సూచన మేరకు బ్లూకోల్డ్స్‌ సిబ్బంది భాస్కర్‌రెడ్డి, రవిలు నవీన్‌ను పోలీస్‌ వాహనంలో హుజూరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.   

చదవండి: గాంధీ ఆస్పత్రికి కోవిడ్‌ బాధితుల క్యూ 

మరిన్ని వార్తలు