సీఎం కేసీఆర్‌ పర్యటనలో అపశ్రుతులు.. అడ్డగింతలు 

22 Jun, 2021 03:37 IST|Sakshi

సీఎం పర్యటనలో భారీ బందోబస్తు

ప్రతిపక్షాల నేతలు ముందస్తుగా అదుపులోకి..

అమరుల స్తూపం వద్ద విద్యార్థి జేఏసీ నేతల నిరసన

ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!

సాక్షి నెట్‌వర్క్‌/ వరంగల్‌: సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులను ఆదివారమే ముం దస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నగరవ్యాప్తంగా బారికేడ్లు ఏర్పాటుచేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు సీఎం వస్తుండగా.. సుబేదారి ప్రాంతంలోని తెలంగాణ అమరుల కీర్తి స్తూపం వద్ద కాకతీయవర్శిటీ విద్యార్థి నాయకులు కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. ‘సీఎం కేసీఆర్‌ గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డు తప్పించి అరెస్టు చేశారు.

తమ భూమికి పట్టా పాస్‌బుక్‌ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ వరంగల్‌ కొత్తవాడకు చెందిన వృద్ధ దంపతులు గాదెం ఓదెమ్మ, కట్టయ్య సెంట్రల్‌ జైల్‌ పెట్రోల్‌ బంకు ముందు అత్మహత్య యత్నానికి సిద్ధపడ్డారు. రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్‌ ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చామన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి చేదు అనుభవం
సీఎం కేసీఆర్‌ పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పోలీసులు కాకతీయ వర్సిటీ క్రాస్‌రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దాంతో ఆయన అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ సర్క్యూట్‌ హౌజ్‌ వరకు వచ్చారు. తర్వాత ఏకశిలా పార్కులో జయశంకర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు కేసీఆర్‌ రాగా.. అక్కడికి కూడా సుదర్శన్‌రెడ్డిని పోలీసులు అనుమతించలేదు. మనస్తాపానికి గురైన ఆయన కలెక్టరేట్‌ వరకు నడుచుకుంటూ వెళ్లారు. కాగా.. సీఎం పర్యటన సందర్భంగా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని.. ట్రాఫిక్‌ ఆంక్షలు, భద్రతా కారణాల దృష్ట్యా ఇబ్బంది కలగకూడదని నడిచి వెళ్లానని సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. 

మరిన్ని వార్తలు