కరగని ‘గుండె’

19 Feb, 2022 04:20 IST|Sakshi
రాజీవ్‌నగర్‌ శివారులో టెంట్‌ వేసి, శవంతో నిరీక్షిస్తున్న అరుణ్‌ కుటుంబ సభ్యులు 

ఇంట్లోకి శవాన్ని అనుమతించని ఇంటి యజమాని 

ఊరి బయట టెంట్‌ వేసుకుని నిరీక్షణ

సిరిసిల్లలో విషాదం

సిరిసిల్ల: కొందరి కష్టాలు చూస్తే పగవారికైనా రావద్దనిపిస్తుంది. సొంత ఇల్లు లేదు.. భార్య ఏనాడో కన్నుమూసింది. కొడుకుతో కలసి సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ నేత కార్మికుడి గుండె ఆగిపోయింది. అయితే ఇంటి యజమాని శవాన్ని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఊరి బయట టెంట్‌ వేసుకుని శవాన్ని ఉంచాల్సి వచ్చింది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌లో నివసించే దీకొండ దేవదాస్‌ (66) నేతకార్మికుడు.

దేవదాస్‌ భార్య కళావతి చాలా రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు అరుణ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా, దేవదాస్‌ అనారోగ్యంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో శవాన్ని ఇంటికి తేవద్దని యజమాని చెప్పాడు. దీంతో కొడుకు అరుణ్‌కు ఎటు పోవాలో తెలియక శుక్రవారం రాజీవ్‌నగర్‌ శివారులోని ప్రభుత్వ స్థలంలో టెంట్‌ వేసి తండ్రి శవాన్ని ఉంచాడు. 

ఓ కూతురు భివండిలో ఉండడంతో ఆమె వచ్చేంత వరకు కుటుంబ సభ్యులు అక్కడే నిరీక్షించారు. అరుణ్‌ చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో బంధువులు ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. పేదవాడైన అరుణ్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు