Purana Pul Bridge: 400 సంవత్సరాల చరిత్ర.. కులీకుత్‌బ్‌షా, భాగమతి ప్రేమకు చిహ్నం.. 

11 Feb, 2022 21:17 IST|Sakshi

నాటి ప్యారానా పూలే నేటి పురానాపూల్‌..

పట్టించుకోని టూరిజం శాఖ అధికారులు     

సాక్షి, జియాగూడ: ప్రపంచంలోనే ఏకైక ప్రేమికుల వారధిగా పురానాపూల్‌ వంతెన ప్రేమకు సాక్షిగా నిలిచింది. ఇక్కడి నుంచే భాగ్యనగర నిర్మాణానికి పునాది పడింది. ఎన్నో విశేషాలతో నిర్మించిన ఈ చారిత్రక వారధి నిర్లక్ష్యానికి గురవుతోది. కట్టడానికి ఎలాంటి భద్రత లేదు. ప్రేమికుల వారధిగా గుర్తింపు పొందిన ఈ వారిదిపై ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని పలువురు కోరుతున్నారు.

కులీకుత్‌బ్‌షా, భాగమతి ప్రేమకు చిహ్నం.. 
గోల్కొండ యువరాజు మహ్మద్‌ కులీకుత్‌బ్‌షా పరవళ్లు తొక్కుతున్న మూసీనది అవతలి ఒడ్డన్న నివసించే భాగమతి ప్రేమలో పడ్డాడు. తండ్రి సుల్తాన్‌ ఇబ్రహీం కులీ కుత్‌బ్‌షా వీరి ప్రేమను గుర్తించి వీరి ప్రేమకు చిహ్నంగా పురానాపూల్‌ను ప్యారానాపూల్‌గా నామకరణం చేసి నిర్మించాడు. వీరి ప్రేమకు సాక్షిగా వంతెన, భాగ్యనగరం అంచెలంచెలుగా వెలిసింది.  

చారిత్రాత్మకమైన వంతెన....
పురానాపూల్‌ వంతెన కుతుబ్‌షాహీలు నిర్మించిన అద్భుత నిర్మాణాల్లో ఒకటి. అంతేకాదు హైదరాబాద్‌ నగరంలో నిర్మించిన మొదటి వంతెన కూడా ఇదే. ఈ వంతెన నిర్మాణం క్రీ.శ.1578లో ఇబ్రహీం కులీకుత్‌బ్‌షా నిర్మించారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్‌ మీదుగా పాతబస్తీకి వెళ్లేందుకు ఈ వంతెనను నిర్మించారు.   

విదేశీయులు సందర్శన.. 
ఆసఫ్‌జాహీల కాలంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఫ్రెంచి బాటసారి టావెర్నియర్‌ వంతెన నిర్మాణ శైలిని చూసి ముగ్దుడయ్యాడు. దీనిని ప్యారిస్‌లోని ఫౌంట్‌ న్యూప్‌తో పోల్చాడు. ఎన్నో విశేషాలతో కూడిన ఈ వంతెనను ప్రభుత్వం గుర్తించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర టూరీజం శాఖ కిషన్‌రెడ్డి, తెలంగాణ టూరీజం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ టూరీజం డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా వంత్తెనను సందర్శించాలని పలువురు కోరుతున్నారు.

 

సమస్యలెన్నో.. 
400 ఏళ్ల నాటి ఈ నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. రెండు మూడు సార్లు భారీ వరదలకు కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ నిజాం పాలకులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం వంతెనపై కూరగాయల మార్కెట్‌ కొనసాగుతోంది. పలు చోట్ల వంతెన ప్రహరీ కూడా కూలిపోయింది. వంతెన పైనే వ్యాపారులు షెడ్లు వేసుకునేందుకు ఇనుప పైపులు పాతుతున్నారు. దీంతో వంతెనకు ప్రమాదం ఏర్పడుతోంది. అలాగే వంతెన దిగువన మూసీ మురుగునీరు నిలిచి ఉండడంతో వంతెన బీటలు వారుతోంది.

 వంతెనపై కూరగాయల మార్కెట్‌

మరిన్ని వార్తలు