నేటి నుంచే ‘జంగ్‌ సైరన్‌’

2 Oct, 2021 03:31 IST|Sakshi

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై మరో ఆందోళనకు కాంగ్రెస్‌ సిద్ధం 

నేడు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు పాదయాత్ర 

65 రోజుల పాటు జిల్లా, మండలస్థాయిలో పోరాటం 

పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, కాకతీయ వర్సిటీల్లో సభలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మరో ఉద్యమానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుడుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజీవ్‌ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజులపాటు సాగనుంది. ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’పేరుతో డిసెంబర్‌ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.

రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ కార్పొరేట్‌స్థాయిలో విద్యను అందించాలని, రూ.4 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లించాలని, వెంటనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో భాగంగా మండల, ఉమ్మడి జిల్లాల స్థాయిలో యూత్‌కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టనున్నాయి.

అదేవిధంగా పాలమూరు, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కలిసి సదస్సులు నిర్వహిస్తారు. వీటికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నేతలు హాజరవుతారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్‌ 9న పరేడ్‌గ్రౌండ్‌లో ముగింపు కార్యక్రమాన్ని లక్షలాది మంది నిరుద్యోగులతో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పార్టీ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ వచ్చేలా ప్రణాళిక రూపొందించారు.  

ప్రభుత్వ మెడలు వంచాలి: రేవంత్‌ రెడ్డి 
‘జంగ్‌ సైరన్‌’గురించి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తిని టీఆర్‌ఎస్‌ మంటగలిపిందన్నారు. ఏడున్నరేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణ యువతతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన చేపడుతున్న ఈ ఆందోళనకు అందరూ మద్దతుగా నిలిచి ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు.

పోస్టర్‌ ఆవిష్కరణ 
జంగ్‌ సైరన్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం గాంధీభవన్‌లో యూత్‌కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆవిష్కరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లేవని యూత్‌కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పన లేక విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు.   

మరిన్ని వార్తలు