కరోనా మరణాల నిర్ధారణకు త్రిసభ్య కమిటీ

9 Nov, 2021 02:54 IST|Sakshi

కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ 

మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ 

నష్టపరిహారం కోసం ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకోవచ్చు  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కరోనాతో మరణించినట్లుగా అధికారికంగా ధ్రువపత్రాన్ని జారీ చేసేందుకు కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీని నియమిస్తూ సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో), జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్లను సభ్యులుగా నియమించింది.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నష్టపరిహారాన్ని కోరుతూ మీ సేవా కేంద్రం ద్వారా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ నష్టపరిహారం చెల్లిస్తుంది. అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా వారి బ్యాంకు ఖాతాలోనే నేరుగా నష్టపరిహారాన్ని జమ చేస్తారు. 

ఇవీ మార్గదర్శకాలు... 
కరోనా మరణ ధ్రువపత్రం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. విషం తాగడం, హత్య, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాలు తదితర కారణాలతో మరణించినవారికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా బయటపడితే, ఆ మరణాన్ని కరోనా మృతిగా పరిగణించబోమని స్పష్టం చేసింది. 80 శాతం కరోనా మరణాలు వ్యాధి బారినపడిన 13 రోజుల్లోనే సంభవించగా, 90 శాతం మరణాలు 18 రోజుల్లోపు, 95 శాతం మరణాలు 25 రోజుల్లోగా జరిగాయి.

ఈ నేపథ్యంలో కరోనా బారినపడిన 30 రోజుల్లోగా బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందితే, దాన్ని కరోనా మరణంగానే పరిగణనలోకి తీసుకోవాలని ఐసీఎంఆర్‌ సూచించింది. కరోనా నిర్ధారణ అయిన తర్వాత కొందరు ఇంటి వద్దే చికిత్స పొందుతూ మరణిస్తే, దానిని కూడా కోవిడ్‌ మృతిగానే పరిగణించాలని పేర్కొంది. వీరేకాకుండా తమ బంధువుల మరణాలు కరోనా కారణంగానే జరిగాయని భావించేవారు త్రిసభ్య కమిటీకి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత జిల్లాస్థాయి కమిటీ ధ్రువపత్రాన్ని జారీచేస్తుందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో సోమవారం నాటికి 3,967 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆయా కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, నష్టపరిహారం సొమ్ము అందుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రభుత్వం దృష్టికి రాని మరణాలు కూడా ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. అలాంటి మరణాలకు సంబంధించి కూడా మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే వాటిని కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది.    

మరిన్ని వార్తలు