నేటి నుంచి లాసెట్‌ కౌన్సెలింగ్‌ 

14 Dec, 2020 08:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. కోవిడ్‌ నేపథ్యంలో ఈసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇందు కోసం ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోనే ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించి స్లాట్‌ రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న తేదీల్లోనే ఒరిజినల్‌ సర్టిఫికెట్ల స్కానింగ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. అప్‌లోడ్‌ చేయాల్సిన సర్టిఫికెట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చామని తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు స్పెషల్‌ కేటగిరి విద్యార్థు లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, వారు కూడా ఫీజు చెల్లించినప్పుడే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 26, 27వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 28వ తేదీన ఆప్షన్లు ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. ఈనెల 29న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన విద్యార్థులంతా 31వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని పేర్కొంది. 31వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది.   

రేపు ఐసెట్‌ సీట్ల కేటాయింపు 
సాక్షి, హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 15న సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. ప్రవేశాల కోసం 16,800 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, అందులో 15,067 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీట్ల కేటాయింపు వివరాలను  tsicet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు