డీఆర్‌డీవో పాత్ర ఎనలేనిది

26 Jan, 2021 08:45 IST|Sakshi

కోవిడ్‌పై పోరులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

సాక్షి, హైదరాబాద్‌/సంతోష్‌నగర్‌: క్షిపణి వ్యవస్థల తయారీలో భారత్‌ ఆత్మనిర్భరత సాధించడంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పాత్ర ఎనలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. క్షిపణి వ్యవస్థల విషయంలో ఇతర దేశాలు భారత్‌పై ఆధారపడేలా చేయడంలో డీఆర్‌డీవో విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ అబ్దుల్‌ కలాం క్షిపణి కేంద్రాన్ని సోమవారం సందర్శించిన ఉపరాష్ట్రపతి.. ఇంటిగ్రేటెడ్‌ వెపన్‌ సిస్టం డిజైన్‌ సెంటర్‌ (ఐడబ్ల్యూఎస్‌డీసీ)ని, కొత్త క్షిపణి సాంకేతిక ప్రదర్శన, సెమినార్‌ హాల్‌ను ప్రారంభించారు.

క్షిపణి కేంద్రంలో తయారైన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఈ సందర్భంగా తిలకించారు. అనంతరం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబనకు గట్టి ప్రయత్నాలు జరుగుతూండటం అభినందనీయం అన్నారు. పలు రక్షణ రంగ ఉత్పత్తులు పూర్తిగా దేశీయంగానే తయారవుతున్నాయని, విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం భారతీయులందరికీ గర్వకారణంగా పేర్కొన్నారు. (చదవండి: గణతంత్ర దినోత్సవం; అలా ఇది నాలుగోసారి!)

వ్యూహాత్మక అవసరాలపై దృష్టిపెట్టాలి.. 
దేశ భవిష్యత్‌ రక్షణ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక రక్షణ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి శాస్త్రవేత్తలకు సూచించారు. కరోనా మహమ్మారిని యంత్రణలో భారత్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, రికార్డు సమయంలో టీకా తయారీతో పాటు ఎగుమతులు కూడా ప్రారంభించిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఎన్‌సీడీసీకి స్థలం ఇవ్వండి: కిషన్‌రెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయనున్న జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ)కి స్థలం కేటాయించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కేంద్రం 2019లోనే ఎన్‌సీడీసీ ఏర్పాటును ప్రతిపాదించి నిధులను కూడా కేటాయించిందని, దీనికోసం మూడెకరాల స్థలం కేటాయించాలని రాష్ట్రాన్ని అడిగిందని  గుర్తు చేశారు. ఎన్‌సీడీసీ స్థాపనకు భూమిని కేటాయిస్తే కేంద్రం తగిన చర్యలు తీసుకునేలా తాను బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు