మతిస్థిమితం లేక.. ఏడేళ్ల తర్వాత స్వగ్రామానికి

14 Oct, 2020 11:15 IST|Sakshi
కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో రాధాబాయి, పూసం రాధ

రాయపూర్‌ రిమ్స్‌ మెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స

ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్‌  రాథోడ్‌ జనార్దన్‌ చొరవతో స్వగ్రామానికి

సాక్షి, నార్నూర్‌: మండలంలోని జామ్‌డా గ్రామానికి చెందిన పూసం మల్కు-సీతాబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పూసం రాధ (36) మతిస్థిమితం సరిగ్గా లేక 2013లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా జాడ కానరాలేదు. 2014లో ఛత్తీస్‌ఘడ్‌ రాయపూర్‌లో రోడ్డుపై వచ్చిపోయే వారిని రాళ్లతో కొడుతుండగా గమనించిన అక్కడి రిమ్స్‌ మెంటల్‌ ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె మానసికస్థితిని గమనించిన వైద్యులు ప్రత్యేక వైద్యం అందించారు. పరిస్థితి మెరుగుపడడంతో వివరాలు సేకరించి ఈ నెల 6న స్థానిక ఎస్సై విజయ్‌కు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సమాచారాన్ని అందించారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ మడావి ముక్తా రూప్‌దేవ్‌ స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌లకు విషయాన్ని తెలియజేశారు. నిరుపేద కుటుంబం ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రత్యేక చొరవ తీసుకొని ఎమ్మెల్యే, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వాహనాన్ని సమకూర్చి ఆమెను స్వగ్రామానికి రప్పించారు. ఏడేళ్ల తర్వాత స్వగ్రామానికి పూసం రాధా ఆరోగ్యంగా చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె రాక కోసం ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్‌లకు ఆదివాసీ, రాయిసెంటర్‌ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాయి సెంటర్‌ జిల్లా సార్‌మేడి మెస్రం దుర్గు తెలిపారు. 

మంత్రి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు
కైలాస్‌నగర్‌(ఆదిలాబాద్‌): రాష్ట్ర దేవాదాయన, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచటం లేదని అవగాహన రహిత్యంగా మాట్లాడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ విమర్శించారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ రైతులు కష్టాలను తొలగించేందుకు నూతన వ్యవసాయ చట్టాని తీసుకువస్తే ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గతేడాది సీసీఐ ద్వారా అత్యధికంగా పత్తి కొనుగోలు చేయడం జరిగిందని, ఈ నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఎంతో లాభం జరుగుతుందని అన్నారు.

రాష్ట్ర మంత్రి వర్గంలో ఉంటూ రైతులను మోసం చేసే విధంగా వాక్యాలు చేయడం సమాంజసం కాదన్నారు. నూతన వ్యవసాయ చట్టం ద్వారా రైతులు దేశంలో ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు పంట దిగుబడులను కొనుగోలు చేసి నెలల తరబడి రైతులు డబ్బులు ఇవ్వలేదని, గతేడాది సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసి వారంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో సీసీఐ ద్వారా కొనుగొల్లు చేపట్టి తీరుతామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు జోగు రవి, దినేష్‌ మటోలియా, నాయకులు అంకత్‌ రమేష్, లోక ప్రవీణ్‌ రెడ్డి, సోమ రవి, రాకేష్, సంతోష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు