పంది అనుకుని ప్రాణం తీశారు..!

11 Nov, 2023 00:36 IST|Sakshi

శృంగవరపుకోట: మండలంలో సర్వత్రా చర్చనీయాంశమైన గిరిజన యువకుడి హత్యోదంతంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త అడ్డతీగ గ్రామంలో గిరిజన యువకుడిపై దాడిి చేసి చంపారన్న వార్తల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. హత్యకు గురైన పాంగి అర్జున్‌ గ్రామానికి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో పనిచేస్తూ, కుటుంబంతో ఉంటున్నాడు. గురువారం సాయంత్రం పుట్టగొడుగుల కోసమని పొదల వెనుక వెదుకులాడుతుండగా, అదే సమయంలో అడవి పందుల వేటకోసం వచ్చిన కొంతమంది పొదల్లో కదలికలు చూసి నాటుతుపాకీతో కాల్చడంతో అర్జున్‌ గాయపడి కేకలు వేయగా వారంతా రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పరిిస్థితి విషమించడంతో గ్రామంలోకి సమాచారం చేరవేసి నిందితులు జారుకున్నారు. 108లో అర్జున్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలిలో విచారణ చేసిన పోలీసులు ఈ ఘటనలో 16మంది నిందితులు ఉన్నట్లు గుర్తించి, 12 మందిని, అదుపులోకి తీసుకుని, వారి నుంచి నాటుతుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఎస్‌కోట ఎస్సై తారకేశ్వరరావును వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులో లేరు. మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మృతుని భార్య కాంతం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు