బీసీలను అణగదొక్కిన టీడీపీ

11 Nov, 2023 00:36 IST|Sakshi

బొబ్బిలి/సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో బీసీలను అణగదొక్కిన విషసంస్కృతి టీడీపీ ప్రభుత్వంలో అమలైతే, బీసీలకు సముచిత స్థానం కల్పించి వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో అగ్రవర్ణానికి చెందిన ఆశోక్‌ గజపతిరాజు, రాష్ట్రమంత్రిగా బీసీకి చెందిన కిమిడి మృణాళిని తప్పించి బొబ్బిలి రాజులకు మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, అల్లూరి సీతారామరాజు, కొమురంభీంలను ఆదర్శంగా తీసుకుని వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇస్తోందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం, సాలూరు ప్రాంతాల ప్రజాప్రతినిధులు పుష్పశ్రీవాణి, రాజన్నదొరకు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం ఇందులో భాగమేనన్నారు. ఎంపీ స్థానాలను సైతం ఎస్టీ మహిళ మాధవి, బీసీకి చెందిన బెల్లాన చంద్రశేఖర్‌కు కేటాయించి గౌరవించిందన్నారు. వైద్య, ఇంజినీరింగ్‌ కళాశాలలు, గిరిజన వర్సిటీ వంటివి ఏర్పాటుచేసి వైద్య, విద్యాభివృద్ధికి కృషిచేస్తోందన్నారు. చేసిన మేలును ప్రజలకు వివరించి, వారి ఆశీస్సులు పొందాలన్నదే సామాజిక సాధికార యాత్ర ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.

●పార్వతీపురం నియోజకవర్గంలోని 78 వేల కుటుంబాలను గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలిశానని, బతకగలమన్న ధీమా కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎంగా రావాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కొమ్ముకాసిన ఎన్‌సీఎస్‌ యాజమాన్యం కొమ్ములు వంచి రూ.27 కోట్లకు పైగా బిల్లులు చెరకు రైతుల ఖాతాలకు జమచేయించిన ఘనత కూడా వైఎస్సార్‌ సీపీదేనన్నారు. రూ.35 కోట్ల ఖర్చుతో ప్రతి గ్రామానికి తాగునీరు కల్పించే చర్యలు ప్రజా సంక్షేమానికి నిదర్శనమన్నారు.

●జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి లేని పరిపాలన సాకారమైందని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రా జు అన్నారు. ప్రభుత్వం నియమించిన 4.50 లక్షల ఉద్యోగాల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవేనన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఏం చేశామో అదే చెబుతున్న ప్రభుత్వం మాదని, గతంలోవలే సింగపూర్‌, దుబాయ్‌ వంటి గ్రాఫిక్స్‌చిత్రాలతో మోసం చేయడంలేదన్నారు. ఇదొక సంక్షేమ జైత్రయాత్రగా అభివర్ణించారు. సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

మన్యంలో ప్రగతిపాలన: పరీక్షిత్‌ రాజు

మరిన్ని వార్తలు