‘సింహాచలం’ భూమిపై తప్పుడు పత్రాలు 

26 Sep, 2017 02:32 IST|Sakshi

వాటిని హైదరాబాద్‌ ఎస్‌బీఐలో తనఖా

రూ.34 కోట్లు రుణం... నకిలీ పత్రాల నిందితుల అరెస్టు

పెందుర్తి: విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానం కేంద్రంగా ఓ భారీ కుంభకోణం బట్టబయలైంది. దేవస్థానం భూమిని తమ పేరున తప్పుడు పత్రాలు సృష్టించి వాటితో రూ.34 కోట్లు బ్యాంక్‌ రుణం పొందిన ముఠాను పెందుర్తి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. విశాఖ నగర నార్త్‌ జోన్‌ ఏసీపీ ఎల్‌.అర్జున్‌ వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జోక విష్ణు దుర్గాప్రసాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఈ నేపథ్యంలో తన వద్ద పనిచేస్తున్న కాకినాడకు చెందిన బోదసకుర్తి గొల్లయ్యకాపు పేరిట  సింహాచలం దేవస్థానానికి చెందిన  సర్వే నంబరు 3/ఎ4లో దాదాపు ఆరెకరాలకు పట్టా చేయించాడు. దీనికి ఆరిలోవ సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గేదల లక్ష్మిగణేశ్వరరావు సహకరించి నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌ డీడ్‌ సృష్టించారు. అనంతరం భూమిని గొల్లయ్య భార్య వరసత్యవేణి పేరిట గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. వీటిని ఆధారంగా  హైదరాబాద్‌లో విన్‌డేటా సొల్యూషన్స్‌ పేరుతో కంపెనీ పెడుతున్నట్లు చెప్పి బంజారాహిల్స్‌లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.34 కోట్లు రుణం తీసుకున్నారు.

నిందితుడు తొలి వాయిదా నుంచే నగదు చెల్లించకపోవడంతో బ్యాంక్‌ అధికారులు ఆరా తీశారు. తనఖా పెట్టింది దేవస్థానం భూమి అని తేలడంతో 2014 ఆగస్టులో విషయాన్ని దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌కు చెప్పారు. ఆయన పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిఘాపెట్టి  నిందితుడు గొల్లయ్యను పట్టుకున్నారు. అతడి ద్వారా మిగిలిన వారి ఆచూకీ తెలుసుకొని వారినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో గొల్లయ్య, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, వీరాస్వామిలను అరెస్ట్‌ చేయగా కీలకపాత్రధారి గణేశ్వరరావు పలు భూ కుంభకోణం కేసుల్లో ఇప్పటికే జైల్లో ఉన్నాడు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు