'దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలుచేయాలి'

30 Aug, 2015 20:45 IST|Sakshi

తిరుచానూరు: దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం అమలు చేసినప్పుడే ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుందని అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్‌ఈఏ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బిజ్‌నందన్‌శర్మ తెలిపారు. తిరుపతిలో ఆదివారం 'కేంద్రం, రాష్ట్రం - విద్యాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు' అనే అంశంపై జాతీయ స్థాయి విద్యాసదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బిజ్‌నందన్‌శర్మ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రభుత్వ విద్యారంగం కుంటుపడిందని, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడచినా విద్యాపరంగా అభివృద్ధి చెందకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్‌కు అనుకూలంగా వ్యవహరించడం వల్లే సమస్య ఎదురవుతోందన్నారు.

బ్రిటీష్ వారు వదిలి వెళ్లిన ఆంగ్ల భాషపై మక్కువ చూపుతూ మాతృభాషను చిన్నచూపు చూడడం కూడా దీనికి ఒక కారణమని తెలిపారు. మాతృభాషలో విద్యాబోధన జరిగినప్పుడే అభివృద్ధి చెందుతామని వివరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి వివేకానందదాస్ మాట్లాడుతూ.. కొఠారి కమిషన్ రూపొందించిన నివేదికను అమలు చేసినప్పుడే విద్యావిధానం బలోపేతమవుతుందన్నారు. అనంతరం సదస్సులో 7 తీర్మానాలను ప్రతిపాదించారు. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు