జీవనశైలి జబ్బులకు 'చెక్‌'.. 

12 Nov, 2019 04:23 IST|Sakshi

రాష్ట్రంలో మరో 110 ప్రత్యేక క్లినిక్‌లు

ప్రాథమిక దశలోనే బీపీ, సుగర్, హైపర్‌టెన్షన్‌ గుర్తింపునకు సర్కారు చర్యలు

ప్రస్తుతం 85 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో..13 జిల్లా ఆస్పత్రుల్లో సేవలు

వీటికి అదనంగా మరిన్ని ఏర్పాటు

నియోజకవర్గ స్థాయిలో ప్రజల అవగాహనకు కసరత్తు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న జీవనశైలి జబ్బుల (నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజెస్‌..ఎన్‌సీడీ – అసాంక్రమిక వ్యాధులు)ను ప్రాథమిక దశలోనే నియంత్రించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్‌సీడీ క్లినిక్‌ల సంఖ్యను మరింతగా పెంచేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 13 జిల్లా ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 98చోట్ల ఈ ఎన్‌సీడీ క్లినిక్‌లు ఉన్నాయి.

బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పెరుగుతుండటంతో ఇవి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో మరో 110 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఓపీ సేవలతో పాటు ఇక్కడే రక్త పరీక్షలు కూడా చేస్తారు. కాగా, కొత్తగా ఏర్పాటుచేసే ఒక్కో క్లినిక్‌కూ ఒక డాక్టరు, స్టాఫ్‌ నర్సు, ఫిజియోథెరపిస్ట్‌ను నియమిస్తారు. క్లినిక్‌ల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలకు జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆమోదం తెలిపి అక్కడ నుంచి అనుమతులు రాగానే ఈ 110 క్లినిక్‌లలో ఓపీ సేవలు నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ వీటిల్లో సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల రిస్క్‌కు చేరువవుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, వీటి నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అంతేకాక.. ఈ శాఖలో సంస్కరణల కోసం సుజాతారావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సైతం రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉందని, దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ఈ నేపథ్యంలో.. వీటి నియంత్రణకు విధిగా చర్యలు అవసరమని అధికారులు భావించి అదనంగా ఎన్‌సీడీ క్లినిక్‌లను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, చాలామంది గ్రామీణ ప్రాంత వాసులకు మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులపై అవగాహన లేనందున.. ప్రతీ నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజలకు వీటిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

ప్రాథమిక దశలోనే  వ్యాధుల గుర్తింపు
కొత్తగా ఏర్పాటుచేసే క్లినిక్‌ల ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా సకాలంలో వైద్య సేవలు అందించవచ్చు. అన్నింటికీ మించి.. బీపీ బాధితులు ఏటా పెరుగుతున్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది.    
– డాక్టర్‌ గీతాప్రసాదిని, ప్రజారోగ్య శాఖ అదనపు సంచాలకులు

>
మరిన్ని వార్తలు