‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

4 Oct, 2019 12:07 IST|Sakshi

నాడు పాదయాత్రలో మాట ఇచ్చిన చోటే పథకాన్ని ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల చొప్పున సాయం

సీఎం జగన్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత

సాక్షి, పశ్చిమ గోదావరి(ఏలూరు): నేను చూశాను.. నేను విన్నాను..నేను ఉన్నాను అనే మాటకు కట్టుబడి, చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకానికి శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. ఇచ్చిన మాట చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టడం విశేషం. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి చలించిన వైఎస్‌ జగన్‌ ఏలూరులో జరిగిన బహిరంగ సభలో​ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్‌, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
 

ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున అందుకోనున్నారు. గురువారం ఉదయమే ఏలూరు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ తొలుత ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధి పొందే వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కలెక్టర్‌ ముత్యాల రాజు, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’పథకంతో తమకు చేయూతనిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఆటో డ్రైవర్లు పుష్ప గుచ్ఛాలు, గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి ఈ పథకం ప్రారంభించినందకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  


అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘2018, మే 14న పాదయాత్రలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీ అమలు చేశాం. ఆటో కార్మికులను కష్టాలను కళ్లారా చూశా. అందుకే వైఎస్సార్‌ వాహన పథకాన్ని రూపొందించాం. ఈ పథకం కింద కింద ఆటో డ్రైవర్లకు రూ. 10 వేల చొప్పున.. ఐదేళ్లలో రూ. 50 వేలు జమ చేస్తాం. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతీ అర్హుడికి ఈ పథకం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. 

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఆర్థిక సహాయం అందిస్తాం. ఇప్పటివరకు వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఈ రోజు నుంచే పథకం అమలుకానుంది. ఇంకా అర్హులు ఎవరైన ఉంటే వారికి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నాం. వారికి వచ్చే నెల నుంచి నగదును అందిస్తాం. ఇలాంటి ఆర్థిక సహాయం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలాంటి బృహత్తర పథకాలు అమలవుతున్నందుకు గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో పథకాలతో ప్రతీ పేదవాడిని ఆదుకుంటామని మాట ఇస్తున్నాను.

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చాం. ఏ గ్రామంలో బెల్టు లేకుండా రద్దు చేశాం. మద్యం దుకాణాలను 4,380 నుంచి 3,500కు తగ్గించాం. అంతేకాకుండా మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నాం. మద్యం షాపుల పక్కన పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశాం. అయితే గాంధీ జయంతి రోజు మద్యం షాపులు తెరిచారని ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు చెప్పండి గాంధీ జయంతి రోజు ఎక్కడైనా మద్యం దుకాణాలు తెరిచి ఉన్నాయా?(ప్రజల నుంచి లేదు.. లేదు అంటూ సమాధానం). రాష్ట్రంలో మంచి జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు. అయితే వారు చేస్తున్న విమర్శలను నేను ఏమాత్రం పట్టించుకోను. పేద ప్రజల ముఖంపై చిరునవ్వు కోసం తమ ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.   

మరిన్ని వార్తలు