అంగన్వాడీలకు ట్యాబ్‌లు

29 Jun, 2015 01:51 IST|Sakshi
అంగన్వాడీలకు ట్యాబ్‌లు

లోపాలు సరిదిద్దేందుకు చర్యలు
రోజువారి సమాచారం ఆన్‌లైన్‌లోకి
యలమంచిలి:
అస్తవ్యస్తంగా ఉన్న అంగన్వాడీ వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పర్యవేక్షకులకు అందజేసిన ట్యాబ్ పీసీలను అంగన్వాడీ కార్యకర్తలకు అందించాలని నిర్ణయించింది. జిల్లాలో స్త్రీశిశు సంక్షేమానికి ప్రభుత్వం ఏటా రూ.200కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ఇంత భారీ మొత్తంలో వ్యయం చేసినా గ్రామీణ ప్రాంతాల్లో తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పూర్తిగా సంరక్షించడంలో లక్ష్యాలను అందుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. శిశుమరణాల సంఖ్య వెయ్యికి నలబై ఉండటంతో అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ వ్యవస్థ సరిగా లేదని ప్రభుత్వం అంచనా వేసింది.

పారదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచి సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. రోజువారీగా కేంద్రాలకు హాజరయ్యే పిల్లలతో పాటు పౌష్టికాహారం కోసం వచ్చే గర్భిణులు, బాలింతల చిత్రాలను ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 25 అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 4,952 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మొత్తం 1.60లక్షల మంది లబ్దిపొందుతున్నారు. వీరందరూ అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం వేళ భోజనం చేస్తున్నారు. 48,846 మంది గర్భిణులు, బాలింతలకు కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్టు ఐసీడీఎస్ లెక్కచెబుతోంది.

ఇదిలా ఉండగా కార్యకర్తలకు అందించనున్న ట్యాబ్ పీసీల నిర్వహణ ఏమేరకు సాధ్యం కానుందన్న అభిప్రాయం ఆ శాఖ అధికారుల్లోనే వ్యక్తమవుతోంది. అందుకు కారణం గతంలో పిల్లలు, గర్భిణులు హాజరు శాతాన్ని నిత్యం తెలుసుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలకు సిమ్‌కార్డులు పంపిణీ చేశారు. వాటి ద్వారా వివరాలను ఎస్‌ఎంఎస్ రూపంలో జిల్లా కేంద్రానికి పంపేలా నిబంధనలు విధించారు. ఈ విధానం ప్రారంభంలో మమ అనిపించినా సిమ్‌కార్డులకు బిల్లులు చెల్లించక మూగబోవడంతో అనతికాలంలోనే కనుమరుగైనట్టు అధికారులు చెబుతున్నారు. ట్యాబ్ పీసీల విధానం అలాకాకుండా పక్కాగా అమలు చేస్తేనే కేంద్రం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నది నిపుణుల అభిప్రాయం.
 
పర్యవేక్షణతో నెరవేరనున్న లక్ష్యం
ట్యాబ్ పీసీలు సూపర్‌వైజర్లకు ఇచ్చాం. త్వరలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇవ్వనుంది. సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టడం మంచిదే. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించేలా పర్యవేక్షణ చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. గతంలో ఇచ్చిన సిమ్‌కార్డులు పనిచేయడం లేదు. అవి పనిచేసేలా చూడాలి. అందుబాటులో ఉన్న సాంకేతిక విధానాన్ని పూర్తిగా ఉపయోగించేలా చర్యలు చేపట్టి జవాబుదారీ తనాన్ని పెంచుతాం. ట్యాబ్‌లు పూర్తిగా వినియోగంలోకి వస్తే ఎవరైనా ఎక్కడైనా పరిశీలించే వెసులుబాటు కలుగుతుంది.
- జి.చిన్మయిదేవి, ఐసీడీఎస్ పీడీ, విశాఖపట్నం

>
మరిన్ని వార్తలు