కడప ప్రజల రుణం తీర్చుకుంటా

17 Jun, 2019 07:07 IST|Sakshi

సాక్షి, కడప : తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన కడప నగర ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా అన్నారు. శనివారం రాత్రి మాజీ కార్పొరేటర్‌ కరీం జిలానీ, ఎన్‌ఆర్‌ఐ సిటీ అలీ, నగర మైనార్టీ ప్రధాన కార్యదర్శి అతావుల్లా, అక్తర్, ఎస్‌. అహ్మద్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో అంజద్‌బాషాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. కడప నగరాన్ని, ముఖ్యంగా రవీంద్రనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.  

రాజోలి రిజర్వాయర్‌ను నిర్మించాలి 
కేసీ కెనాల్‌ చివరి ఆయకట్టు స్థిరీకరణకు రాజోలి రిజర్వాయర్‌ నిర్మించాలని ఆదివారం  ఏపీ రైతు సంఘం నాయకులు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. చంద్ర మాట్లాడుతూ రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.

వైఎస్‌ఆర్‌ హయాంలో రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా వివక్ష చూపాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజోలి రిజర్వాయర్‌ నిర్మించి రైతుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బాలచంద్రయ్య, శివశంకర్‌రెడ్డి, రామాంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు