కేజీహెచ్‌లో ఉచితంగా కీళ్ల మార్పిడి

1 Jan, 2020 13:14 IST|Sakshi
కీళ్లమార్పిడి అవగాహన సదస్సులో పాల్గొన్న వైద్యాధికారులు

ఏడాదిలో 151 ఆపరేషన్ల నిర్వహణ

శస్త్ర చికిత్సలకు రూ. 70 లక్షల నిధి

లబ్ధిదారులు ప్రచారం చేయాలని ఏఎంసీ ప్రిన్సిపాల్‌ విజ్ఞప్తి

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కేజీహెచ్‌లో ఉచితంగా కీళ్లమార్పిడి శస్త్ర చికి త్సలు నిర్వహిస్తున్నామని ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. మంగళవారం ఆర్థోపెడిక్‌ వార్డులోని సమావేశ మందిరంలో కీళ్ల మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.  కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున, రాష్ట్ర ప్రభుత్వ ఇల్‌నెస్‌ ఫండ్‌ను వినియోగించి ఈ ఏడాదిలో 151 కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించామన్నారు. కీళ్ల మార్పిడి చేయించుకున్న రోగులు కేజీహెచ్‌లో ఉచితంగా ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు ప్రచారం చేయాలని కోరారు.

వైద్య విద్యా సంచాలకుడు గత ఏడాది రూ.70 లక్షల నిధిని కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు కేటాయించారని చెప్పారు. ఆర్థోపెడిక్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఉచిత కీళ్ల మార్పిడి చికిత్సకు రూ.2 కోట్ల నిధులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సకు కార్పొరేట్‌ ఆస్పత్రులు రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయన్నారు. అవగాహన సదస్సులో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.ఇందిరాదేవి, ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ శివానంద, డాక్టర్‌ లోక్‌నాథ్, ఏఆర్‌ఎంవో డాక్టర్‌ సిహెచ్‌.సాధన, కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు